‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమ పర్యటన కోసం మంత్రి ఉష శ్రీచరణ్ తగిన ప్రణాళిక రూపొందించుకోగా.. పలు గ్రామాలకు వాహనాలు వెళ్లే పరిస్థితి లేకుండాపోయింది. గతుకులు దేరిన రోడ్లు కారణంగా రెండు రోజుల నుంచి మంత్రి ఉష శ్రీచరణ్ బైకుపై తిరగాల్సి వస్తోంది. వివరాల్లోకి వెళ్ళితే..... కల్యాణదుర్గం నియోజకవర్గంలోని కుందుర్పి మండలంలో గ్రామీణ రహదారులు అధ్వానంగా ఉన్నాయి. మలయనూరు పంచాయతీ పరిధిలో బస్సులు, కార్లు తిరిగే పరిస్థితి లేదు. రోడ్లు బాగు చేయాలని ఈ ప్రాంత ప్రజలు మొత్తుకుంటున్నా ప్రజాప్రతినిధులుగానీ, అధికారులు గానీ పట్టించుకున్న పాపానపోవడంలేదు. ఈ క్రమంలో శనివారం చేపట్టిన గడప గడపకు కార్యక్రమానికి శీగలపల్లి-కొల్లారెట్టి మార్గంలో మంత్రి ఉష శ్రీచరణ్ ఓ కార్యకర్త బైకు ఎక్కి పర్యటించారు. రహదారులను బాగుచేయించి, తమ గ్రామాలకు మంత్రి వచ్చుంటే బాగుండేదని ప్రజలు అభిప్రాయపడ్డారు.