ఎమ్మెల్యేను ‘గో బ్యాక్ దూలం నాగేశ్వరరావు’ అంటూ ఉద్దేశించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కలకలం రేపింది. ఏలూరు జిల్లా ముదినేపల్లి అంబేడ్కర్ నగర్లో శనివారం ఎమ్మెల్యే నాగేశ్వరరావు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పర్యటించాలని కార్యక్రమం రూపొందించుకున్నారు. ఈ మేరకు పంచాయతీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో మాల మహానాడు నాయకుడు సేవా నాగ జగన్ బాబూరావు తన ఇంటి ప్రహరీ గోడకు ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఫ్లెక్సీని తొలగించి దానిని ఏర్పాటు చేసిన బాబూరావు, మాదిగ దండోరా నాయకుడు ఏసుపోగు దానియేలును అదుపులోకి తీసుకున్నారు. అంబేడ్కర్ నగర్లో గడప గడపకు కార్యక్రమం జరుగుతున్నంతసేపూ ఎస్ఐ షణ్ముఖ సాయి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు నిర్వహించారు. తమ ప్రహరీ గోడపై పోస్టర్ ఏర్పాటు చేసుకుంటే పోలీసులకు ఎందుకు బాధ అని బాబూరావు కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.