విశాఖపట్టణం ఉక్కు పరిశ్రమకు చెందిన రాయ బరేలీలోని ఫోర్జ్‌డ్ వీల్ ప్లాంట్‌ను విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా విశాఖ ఉక్కును అమ్మకానికి పెడుతున్నట్లు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా కొత్త ఎత్తుగడలకు తెరతీసింది. అందులో భాగంగానే ముందుగా వీల్‌ప్లాంట్ అమ్మకాన్ని వేగవంతం చేసింది. ఆ ప్లాంట్ విలువ దాదాపు రూ.1,900 కోట్ల మేర ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అయితే, ఈ ప్లాంట్‌ను నిర్వహించడానికి గతేడాది సెప్టెంబరులో విశాఖ ఉక్కుపరిశ్రమ బిడ్‌లను ఆహ్వానించింది. అందుకు రెండు ప్రైవేటు కంపెనీలు ఆసక్తి ప్రదర్శించాయని అధికార వర్గాలు చెప్పాయి. కాగా, దేశంలో రైళ్ల కోచ్‌ల చక్రాల కొరత నేపథ్యంలో ప్రభుత్వం వాటిని దిగుమతి చేసుకునేది. దిగుమతులను తగ్గించడానికి దేశంలోనే రైలు చక్రాలను తయారు చేయాలన్న ఉద్దేశంతో ఉత్తర ప్రదేశ్‌లోని రాయబరేలీలో ఫోర్జ్‌డ్ వీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని యూపీఏ ప్రభుత్వం నిర్ణయించింది. 2013 అక్టోబరు నుంచి 42 నెలల్లో ఈ ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యం విధించుకున్నప్పటికీ తీవ్ర జాప్యమైంది. చివరికి 2021 సెప్టెంబరులో ప్లాంట్ కార్యకలాపాలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు 1,400 లోకోమోటివ్ చక్రాలు, 2,000 ఎల్‌బీహెచ్ చక్రాలను రైల్వే శాఖకు సరఫరా చేసింది. విశాఖలోని ప్రధాన ప్లాంటుతో పాటు అనుబంధంగా వున్న వాటిని కూడా అమ్మేస్తామని గతంలోనే ప్రకటించింది. ఒక్కొక్కటిగా లైన్ క్లియర్ చేసుకోవడానికి దశల వారీగా చర్యలు చేపడుతోంది.