కత్తి పీటతో భార్యను నరికి ఆపై తానూ పీక కోసుకున్నాడో భర్త. ఈ ఘటనలో భార్య మృతి చెందగా, భర్త ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నాడు. వివరాల్లోకి వెళ్ళితే...... పశ్చిమ గోదావరి జిల్లా, జీలుగుమిల్లి శివారు రామన్నపాలెంకు చెందిన ఉర్ల రామాంజనేయులు(రాం దాస్) చెడు వ్యసనాలకు అలవాటు పడి ఇంట్లో డబ్బులు లేకుండా చేయడంతో అతనితో భార్య శ్రీలత ఘర్షణకు దిగింది. ఈ విషయమై కొంత కాలంగా ఇరువురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం సాయంత్రం పరిస్థితి విషమించడంతో భర్త ఇంట్లో వున్న కత్తి పీట తీసుకుని భార్య మెడపై నరికాడు. అనంతరం అతడు మెడపై కోసుకున్నాడు. భార్యాభర్తలిద్దరిని స్థానికులు జీలుగుమిల్లి పీహెచ్‌సీకి తీసుకురాగా, భార్య పరిస్థితి విషమించింది. మెరుగైన వైద్యం కోసం ఇద్దరిని 108లో జంగారెడ్డిగూడెం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ భార్య శ్రీలత మృతి చెందింది. వీరికి 12 ఏళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు సంతానం ఉన్నారు. భార్యా భర్తలిద్దరినీ సీఐ బి.వెంకటేశ్వరావు పరిశీలించి, గొడవకు గల కారణాలను ఆరా తీశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.