భారత హేతువాద సంఘం వ్యవస్థాపక చైర్మన్ రావిపూడి వెంకట్రాది కన్నుమూశారు. ఆయన వయసు 101 సంవత్సరాలు. బాపట్ల జిల్లా చీరాలలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన స్వగ్రామం ఇంకొల్లు మండలం నాగండ్లలో రేపు అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ప్రముఖ హేతువాదిగా గుర్తింపు పొందిన రావిపూడి వెంకటాద్రి 'హేతువాది' అనే మాసపత్రికకు ఎడిటర్ గా వ్యవహరించారు. వేర్వేరు అంశాలపై 100కి పైగా పుస్తకాలను రచించారు. తన రచనల ద్వారా, ప్రసంగాల ద్వారా హేతువాద వ్యాప్తికి కృషి చేశారు. హేతువాద ఉద్యమంలో వేల ఉపన్యాసాలు ఇచ్చిన ఘనత ఆయన సొంతం. హేతువాదంపై ప్రచారం కోసం 1943లో కవిరాజాశ్రమం స్థాపించారు.
హేతువాద వ్యాప్తికోసం ఆయన చేసిన కృషికి గుర్తింపుగా హైదరాబాదులోని తెలుగు యూనివర్సిటీ తాపీ ధర్మారావు అవార్డు, త్రిపురనేని అవార్డు అందించింది. అంతేకాదు, నాగండ్ల గ్రామ సర్పంచిగా 40 ఏళ్ల పాటు ఏకగ్రీవంగా ఎన్నికైన ఘనత ఆయన సొంతం.