ఎస్సీ సబ్ ప్లాన్ కోసం చేసిన చట్టాన్ని మరో పదేళ్లు పొడిగించాలని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు డిమాండ్ చేశారు. దళితుల నిధులు పక్కదారి పట్టకూడదని 1986లో టీడీపీ ప్రభుత్వం దీని కోసం ప్రత్యేక చట్టం తీసుకు వచ్చిందన్నారు. 2013లో హైకోర్టు కూడా ఆమోద ముద్ర వేసిందన్నారు. ఈ చట్టం గడువు ఈ ఏడాది మార్చితో పూర్తవుతోందని, ప్రభుత్వం దీనిని మరో పదేళ్లు పొడిగించాలని కోరారు. ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వైఖరేంటో స్పష్టం చేయాలని మాజీమంత్రి కేఎస్ జవహర్ డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం అంటూ పదే పదే గొప్పలు చెబుతున్న జగన్ ఎస్సీ వర్గీకరణకు సహకరించేలా మాదిగ ప్రజాప్రతినిధులందరూ ఒత్తిడి తీసుకురావాలన్నారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆదిమూలపు సురేశ్, తానేటి వనిత మంత్రి పదవుల్లో ఉండి కూడా మాదిగల సంక్షేమం కోసం నోరు విప్పి మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.