ఉద్యోగాల జాతరకు ఎల్ఐషీ తెరలేపింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా వివిధ జోన్లలో తొమ్మిది వేలకు పైగా పోస్టులను ఎల్ఐసీ భర్తీ చేయనుంది. అప్రెంటిస్ డెవలప్ మెంట్ ఆఫీసర్ (ఏడీవో) పోస్టులకు రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగులను నియమించనుంది. ఇందుకోసం అర్హతగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 9,349 ఉద్యోగాలను భర్తీ చేయనుండగా.. తెలుగు రాష్ట్రాల పరిధిలో 1,408 పోస్టులు ఉన్నాయి. పూర్తి సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చూడొచ్చు.
ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్, ఫైనాన్స్ ప్రొడక్ట్స్ మార్కెంటింగ్ లో కనీసం రెండేళ్ల అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. 2023 జనవరి 1 నాటికి అభ్యర్థుల వయసు 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 10 వ తేదీలోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్థులు రూ.750, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ. 100 దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
ఎంపిక విధానం..
రాత పరీక్ష (ప్రిలిమినరీ/మెయిన్స్) ఇంటర్వ్యూ, ప్రీ-రిక్రూట్‌మెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. మార్చి 12న ప్రిలిమినరీ రాత పరీక్ష, ఏప్రిల్ 8న మెయిన్స్ పరీక్ష ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.51,500ల నుంచి రూ.90,205ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఏయే జోన్ లో ఎన్ని ఖాళీలు..
సెంట్రల్ జోనల్ ఆఫీస్ (భోపాల్): 561 (పోస్టులు)
ఈస్టర్న్ జోనల్ ఆఫీస్ (కోల్‌కతా): 1049 (పోస్టులు)
ఈస్ట్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ (పట్నా) : 669 (పోస్టులు)
నార్తర్న్ జోనల్ ఆఫీస్ (న్యూఢిల్లీ) : 1216 (పోస్టులు)
నార్త్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ (కాన్పూర్) : 1033 (పోస్టులు)
సదరన్ జోనల్ ఆఫీస్ (చెన్నై) : 1516 (పోస్టులు)
సౌత్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ (హైదరాబాద్) : 1408 (పోస్టులు)
వెస్టర్న్ జోనల్ ఆఫీస్ (ముంబయి) : 1942 (పోస్టులు)