తూర్పుగోదావరి జిల్లాలో 2021లో ఒక ప్రభుత్వ ఉద్యోగి విధి నిర్వహణలో ఉండగా మరణించారు. ఆయనకు సంబంధించి ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.5,67,918 ఆ ఏడాది డిసెంబరులోనే మంజూరయ్యాయి. కానీ ఇప్పటి వరకు ఈ డబ్బును ప్రభుత్వం ఆ ఉద్యోగి కుటుంబానికి చెల్లించలేదు. మరి ఈ బిల్లు పాస్ చేయడానికి కూడా కొవిడ్, రాష్ట్ర విభజన అడ్డు వచ్చాయా..? జగన్ సర్కారు ఇదే చెబుతోంది. సకాలంలో జీతాలు, పెన్షన్లు చెల్లించకపోవడం.. బకాయిలు ఇవ్వకపోవడంపై ఉద్యోగ సంఘాలు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు ఫిర్యాదు చేయడం, ఆయన శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డిని పిలిపించి ఆరా తీయడం.. ఆ వెంటనే ఉద్యోగులకు ప్రభుత్వం ఎంతో చేస్తోందని చెప్పుకొంటూ ఆర్థిక శాఖ ప్రకటన చేయడం తెలిసిందే. రాష్ట్ర విభజన, కొవిడ్ వల్లే ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదంటూ 8 పేజీలతో వివరణ విడుదల చేసింది. కానీ ఇది పూర్తిగా అవాస్తవం . ఈ రెండూ ప్రస్తుతం సమస్యలే కావు. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లవుతోంది. వాస్తవానికి విభజన జరిగిన వెంటనే ఏపీ ఉద్యోగులకు తెలంగాణ ఉద్యోగులతో సమానంగా 43 శాతం ఫిట్‌మెంట్ లభించింది. ఆ తర్వాత నిరుడు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు 30ు ఫిట్‌మెంట్ ఇస్తే.. మన రాష్ట్రంలో మాత్రం ఉద్యోగులెంతో పోరాటం చేసిన తర్వాత జగన్ సర్కారు 23 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చి చేతులు దులుపుకొంది. అందులోనూ ఎన్నో కొర్రీలు.. ఆంక్షలు. రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రకు ఆదాయపరంగా నష్టం జరిగింది కాబట్టే దానిని భర్తీ చేసేందుకు గత ఆర్థిక సంవత్సరంలో రూ.17,250కోట్లు, ఈఏడాది రూ.10,500 కోట్ల వరకు కేంద్రం రాష్ట్రానికి రెవెన్యూ లోటు గ్రాంటుగా ఇచ్చింది. 2014-15నాటి లోటు గ్రాంటు ఇవ్వనని ఎప్పుడూ చెప్పలేదు. నచ్చజెప్పి తెచ్చుకోవడం జగన్ ప్రభుత్వానికి చేతకావడం లేదంతే.