శ్రీకాకుళం జిల్లా, ఉద్దానంలో నీటి భాదలు ఎక్కువైపోతున్నాయి. ఉద్దానం తాగునీటి ప్రాజెక్టు కార్మికులకు రెండేళ్లుగా వేతనాలు అందకపోవడంతో సమ్మె బాట పట్టారు. ఈ నేపథ్యంలో మూడు రోజులుగా పంపింగ్ నిలిచి పోయి.. 287 గ్రామాల ప్రజలకు తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల ప్రజల తాగునీటి కష్టాలను తీర్చేందుకు 1998లో దివంగత కేంద్ర మాజీమంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు కృషితో ఉద్దానం తాగునీటి ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. దీని ద్వారా మందస, నందిగాం, వజ్రాపుకొత్తురు, పలాస, కంచిలి, సొంపేట, కవిటి, ఇచ్ఛాపురం మండలాల్లో ప్రజలకు తాగునీరందిస్తున్నారు. ప్రస్తుతం వేతనాల కోసం ఉద్దానం ప్రాజెక్టు సిబ్బంది సమ్మె చేయడంతో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. సరియాపల్లి, ఎం.గంగువాడ, టి.గంగువాడ, బిడిమి, నగరంపల్లి, బొడ్డపాడు, సిగలపుట్టుగ, మామిడిపల్లి వంటి పలుగ్రామాల్లో నీళ్ల కోసం మైళ్ల దూరం నడిచి వెళ్తున్నారు. కిడ్నీ వ్యాప్తి సమస్య కారణంగా బోర్లు నీరు తాగేందుకు ఆసక్తి చూపడం లేదు. తాగునీటి ఇబ్బందుల దృష్ట్యా సరియాపల్లిలో మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. అధికారులు స్పందించి తాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.