రాష్ట్రంలో కరెంటు బస్సుల డ్రైవర్లకు ఎట్టకేలకు వేతనాన్ని రూ.20వేలకు పెంచారు. తొలిదశలో నియమించుకున్న 24మంది డ్రైవర్లకు రూ.19వేల జీతంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దానిప్రకారం మూడు నెలలు జీతాలు సకాలంలో ఇచ్చారు. బస్ పాసు, గుర్తింపు కార్డు లేకపోవడంతో అలిపిరి వద్దకు డ్యూటీకి వెళ్లి రావడానికి రవాణా ఖర్చులు పెట్టుకోవాల్సి వస్తోందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. పైగా రూ.వెయ్యి సేవింగ్స్ పోను రూ.18వేలు మాత్రమే చేతికి వస్తోందని శనివారం మెరుపు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. దీనిపై డ్రైవర్ల నిర్వహణను చూసుకునే విజయవాడకు చెందిన సబ్ కాంట్రాక్టర్ హరనాథకుమార్ జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో శాంతించిన డ్రైవర్లు విధులకు హాజరయ్యారు. ఈ అంశంపై ఆదివారం హరనాథకుమార్ మాట్లాడుతూ.. జీతం రూ.20వేలను చెల్లిస్తానని, బస్సుపాసు, ఐడీ కార్డు కూడా ఆర్టీసీ యాజమాన్యంతో మాట్లాడి ఇప్పించేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు మీడియాకు తెలిపారు. అలాగే పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లి బస్సు పాసు, గుర్తింపు కార్డు మంజూరుకు కృషి చేస్తామని ప్రజారవాణాధికారి చెంగల్‌రెడ్డి కూడా పేర్కొన్నారు.