ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా పలువురు ఐఏఎస్ అధికార్లను బదిలీ చేసింది. కానీ ఇటీవల ఏపీకి వచ్చిన తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కు మాత్రం ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. ఇదిలావుంటే వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ ద్వివేది నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ద్వివేది వ్యవసాయంతో పాటు సహకార, పశుసంవర్ధకం, డెయిరీ డెవలప్‌మెంట్, మత్స్యశాఖల ముఖ్య కార్యదర్శి బాధ్యతలతో పాటు రైతుభరోసా కేంద్రాల ప్రత్యేక కమిషనర్ బాధ్యతలు ఆయనకు అప్పగించారు. అలాగే మైనింగ్‌శాఖ ముఖ్య కార్యదర్శిగాను ఆయన కొనసాగనున్నారు.
ఇప్పటివరకు వ్యవసాయ అనుబంధశాఖల ముఖ్య కార్యదర్శిగా ఉన్న వై.మధుసూదన్‌రెడ్డిని రిలీవ్ చేశారు. ఇక గోపాలకృష్ణ ద్వివేది స్థానంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా.. సెలవుపై వెళ్లి తిరిగి వచ్చిన బుడితి రాజశేఖర్‌ను నియమించారు. ఐఏఎస్‌లను బదిలీ చేసిన ప్రభుత్వం.. 10 రోజుల క్రితం తెలంగాణ నుంచి ఏపీ కేడర్‌కు వచ్చిన సోమేష్ కుమార్‌కు ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు.
సీనియర్ ఐఏఎస్ సోమేష్ కుమార్‌ను విభజన సమయంలో ఏపీకి కేటాయించగా.. ఆయన తెలంగాణలో కొనసాగారు. ఈ వ్యవహారం క్యాట్‌కు చేరగా.. తెలంగాణలో ఉండేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనంతరం క్యాట్ తీర్పుపై తెలంగాణ హైకోర్టులో కేంద్రం సవాల్ చేయగా.. కోర్టు సోమేష్ కుమార్ ఏపీకి వెళ్లాల్సిందేనని తీర్పు ఇచ్చింది. దీంతో ఆయన ఏపీకి వెళ్లి రిపోర్ట్ చేశారు. ఏపీ సీఎం జగన్, సీఎస్ జవహర్‌రెడ్డిని కలిశారు. ఒక అధికారిగా డీఓపీటీ ఆదేశాలు పాటిస్తున్నానని.. ఏపీలో రిపోర్ట్ చేశానన్నారు. రిపోర్ట్ చేసి 10 రోజులు దాటినా ఆయనకు ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు.. అయితే త్వరలోనే ఆయనకు పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.