గుంటూరుజిల్లాలో విషాదం చోటు చేసుకొంది. ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ చెన్నకేశవరావు ఆత్మహత్య కలకలంరేపింది. గుంటూరులోని బ్రాడీపేట 4వ లైన్‌లో ఉంటున్న ఆయన.. తన గదిలో సోమవారం రాత్రి సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. సుచరిత నివాసానికి కొద్దిదూరంలో ఉన్న ఓ హాస్టల్‌లో ఆమె సెక్యూరిటీ సిబ్బంది, కారు డ్రైవర్లు రూమ్ తీసుకుని ఉంటున్నారు.
డ్రైవర్ చెన్నకేశవరావు విధులు ముగించుకుని రూమ్‌కు రాగా.. అనంతరం పీఎస్‌వో రామయ్య వచ్చారు. రామయ్య తన పిస్టల్‌ను తీసి దిండు కింద పెట్టి స్నానం చేసేందుకు వెళ్లాడు. ఇంతలో ఆ పిస్టల్ తీసుకుని చెన్నకేశవురావు కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్‌కు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. చెన్నకేశవరావు కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకుంటున్న జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
చెన్నకేశవరావు ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. ఆయన తరచూ తనకు అప్పులు ఉన్నాయని చెప్పేవారిని.. వాటిని తీర్చలేకపోతున్నానని బాధపడేవారని అంటున్నారు. అలాగే కుటుంబంలో ఆస్తి గొడవలు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరి కుటుంబం గుంటూరు ఏటీ అగ్రహరంలో నివాసం ఉంటోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.