ఉత్తరాంధ్ర ఆరాధ్య దేవతగా పేరొందిన శంబర పోలమాంబ అమ్మవారి సిరిమానోత్సవం సంబరం మంగళవారం జరగనుంది. శంబరలో మధ్యాహ్నం 3 గంటలకు సిరిమానోత్సవం ప్రారంభం కానుంది. జాతర సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సిరిమానును ఈ ఏడాది పూజారి జన్ని పేకాపు రామారావు అధిరోహించనున్నారు
ఘనంగా తొలేళ్ల ఉత్సవం
పోలమాంబ అమ్మవారికి సోమవారం రాత్రి ఘనంగా తొలేళ్ల ఉత్సవం నిర్వహించారు. అమ్మవారిని చదురు గుడి నుంచి పాల జంగడ ఘటాలతో ఊరేగింపు చేపట్టారు. అనంతరం చావిడి వీధిలోని చదురుగుడి వద్ద అమ్మ వారిని ఉంచారు. గ్రామంలోని రైతులంతా ధాన్యం రాసిగా పోసిన తర్వాత అమ్మవారితో ఆ రాశులను తొక్కిస్తారు. ఆ తర్వాత గ్రామంలోని రైతులంతా వారు తెచ్చిన ధాన్యం ఇంటికి తీసుకెళ్లి భద్రపరచుకుంటారు. పంట పొలాల్లో వాటిని రైతులు చల్లుకొని వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. ఇలా చేస్తే రైతులకు మంచి జరుగుతుందని విశ్వసిస్తారు.
మన్యం పండగకు మంచిపేరు రావాలి: కలెక్టర్ శంబర పోలమాంబ జాతరకు వచ్చే భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, మన్యం జిల్లాలో పెద్దజాతర అయినందున జిల్లాకు పేరు తేవాలని కలెక్టర్ నిశాంత్‌కుమార్ అన్నారు. సోమవారం రాత్రి ఆయన పోలమాంబను దర్శించుకున్నారు. అనంతరం జాతరకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా మెడికల్ క్యాంపును సందర్శించి అవసరమైన మందులు ఉన్నవీ, లేనవీ వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. ఎఎస్‌పి దిలీప్‌కుమార్‌తో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. క్యూలైన్ల వద్ద నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని ఇఒ రాధాకృష్ణకు సూచించారు. అవసరమైతే జనరేటర్లను ఎక్కువగా ఏర్పాటు చేయాలన్నారు. తాగునీటికి ఇబ్బందుల్లేకుండా సరఫరా చేయాలన్నారు. సిసి కెమెరాలను పరిశీలించారు. డ్రోన్ కెమెరాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఆర్‌డిఒ హేమలత, డిఎస్‌పి సుభాష్, దేవాదాయశాఖ డిసి సుజాత, పలువురు అధికారులు ఉన్నారు.