వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు సోమవారం పులివెందులకు వచ్చారు. వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి ఇంటి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి ఇంట్లో ఉన్నారా అని ఇంటి వద్ద ఉన్న వారిని వాకబు చేశారు. ఆయన లేరని వారు సమాధానం చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లారు. ఆ తర్వాత ఓఎస్డీ కార్యాలయంతోపాటు పులివెందులలోని సీఎం క్యాంప్ ఆఫీస్‌కు కూడా వెళ్లారు. అక్కడ భాస్కర్ రెడ్డి ఉన్నారేమో అని ఆరా తీశారు. అక్కడ కూడా ఆయన లేరని సమాధానం రావడంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో ఎంపీ అవినాశ్ రెడ్డి పులివెందులకు వచ్చారు. కొద్దిసేపటికే సీబీఐ అధికారులు ఆయనను కలిసి... మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసు ఇచ్చారు. అయితే... తాను ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని, ఐదు రోజుల తర్వాత మాత్రమే విచారణకు రాగలనని అవినాశ్ రెడ్డి స్పష్టం చేసినట్లు తెలిసింది. విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. సీబీఐ అధికారులు తొలుత అవినాశ్ రెడ్డి తండ్రి గురించి ఆరా తీయడం, సాయంత్రానికి ఆయనకే నోటీసు జారీ చేయడం సంచలనం సృష్టిస్తోంది.