భారత్-పాకిస్థాన్ శత్రుత్వం 2019 ఫిబ్రవరిలో అణు జ్వాలగా మారడానికి ఎంత సమీపానికి వచ్చిందన్న విషయం ప్రపంచానికి సరిగ్గా తెలుసని నేను అనుకోను అమెరికా మాజీ విదేశాంగ మంత్రి మైక్ పాంపియా వెల్లడించారు. బాలాకోట్ సర్జికల్ స్ట్రయిక్ (2019 ఫిబ్రవరి) సమయంలో పాక్-భారత్ మధ్య అణుదాడి జరిగి ఉండేదన్న సంచలన విషయాన్ని ఆయన తాజాగా వెల్లడించారు. ‘‘నాడు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కాల్ తో నేను నిద్ర లేచాను. బాలాకోట్ సర్జికల్ స్ట్రయిక్ నేపథ్యంలో భారత్ పై అణు దాడికి పాకిస్థాన్ సిద్ధమవుతోందని.. దీనికి తగిన విధంగా బదులు ఇచ్చేందుకు భారత్ కూడా సిద్ధమవుతున్నట్టు సుష్మ నాకు చెప్పారు.
ఈ కాల్ చేసినప్పుడు (ఫిబ్రవరి 27-28) నేను హనోయిలో అమెరికా-ఉత్తర కొరియా సదస్సులో ఉన్నాను. ఈ సంక్షోభాన్ని నివారించేందుకు నా బృందం ఆ రోజు రాత్రంతా ఎంతో కృషి చేసింది.
నాడు సుష్మా కాల్ చేసినప్పుడు ఒక్క నిమిషం సమయం ఇవ్వండి సమస్యను పరిష్కరించడానికి అని కోరాను. వెంటనే జాతీయ భద్రతా సలహాదారు బోల్టన్ తో చర్చించాను. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వాతో మాట్లాడాను. భారత్ నాకు ఏమి చెప్పిందన్న విషయాన్ని తెలియజేశాను. అది నిజం కాదని బజ్వా నాకు చెప్పాడు. భారతీయులే అణ్వాయుధాలను మోహరిస్తున్నట్టు పేర్కొన్నాడు. దాంతో నా బృంద సభ్యులు ఇరు దేశాలతో చర్చించి అణు యుద్ధానికి దిగకుండా నివారించగలిగారు’’ అని పాంపియో వివరించారు. ‘నెవర్ గివ్ యాన్ ఇంచ్: ఫైట్ ఫర్ ద అమెరికా ఐ లవ్’ పేరుతో పాంపియో రాసిన పుస్తకం మార్కెట్లోకి విడుదల అయిన సందర్భంగా ఆయన ఈ విషయాలను పంచుకున్నారు.