విశాఖ జిల్లా టీడీపీలో లైంగిక వేధింపుల అంశం కాకరేపుతోంది. జిల్లాలోని భీమిలి నియోజకవర్గంలో టీడీపీ మహిళా నేత సస్పెన్షన్ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. పార్టీ నుంచి సస్పెండ్ చేశామని నేతలు చెబుతుంటే.. తానే రాజీనామా చేశానని ఆమె అంటున్నారు. వివరాల్లోకి వెళితే.. భీమిలి నియోజకవర్గం 5వ వార్డుకు చెందిన గోడి అరుణ తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలిగా పదవిలో ఉన్నారు. అయితే ఆమె పార్టీ నియమావళికి వ్యతిరేకంగా క్రమశిక్షణ ఉల్లంఘించారని.. అందుకే అరుణను టీడీపీ నుంచి సస్పెండ్ చేశామని విశాఖ పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ వ్యవహారంపై కూలంకషంగా పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు.
టీడీపీ నుంచి సస్పెండ్ చేసినట్లు నేతలు చెబుతుంటే.. అరుణ మాత్రం తానే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో గత 10 ఏళ్ల నుంచి చురుగ్గా పాల్గొంటూ నిబ్దతతో క్రమశిక్షణతో ఉన్నానని.. కానీ తన పట్ల కర్నూలు జిల్లా డోన్‌కు చెందిన టీడీపీ నేత ఏడాది నుంచి లైంగికంగా, అసభ్యకరంగా, దారుణంగా వ్యవహారిస్తున్నారని ఆమె ఆరోపించారు. అలాంటి వ్యక్తికి కొమ్మ కాస్తున్న తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు అనిత, పార్టీ నేతల వైఖరితో బాధపడ్డానని.. అందుకే తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి, తెలుగుదేశం పార్టీ క్రియశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
కొంతకాలంగా డోన్‌కు చెందిన టీడీపీ నేత తనతో అసభ్యంగా వ్యవహరించారని.. దీనిపై టీడీపీలో కీలక నేతలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అరుణ అంటున్నారు. బీసీ మహిళా నాయకురాలినైన తన విషయంలో దారుణంగా ప్రవర్తించారన్నారు. అరుణ ప్రస్తుతం రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. మొత్తానికి అరుణ సస్పెన్షన్ విషయం విశాఖ జిల్లాలో చర్చనీయాంశమైంది.