మూడున్నరేళ్ల వైసీపీ పాలనలో తిరుమల పవిత్రతను మంటగలిపారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు. పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం వైసీపీ పాలనలో కుంభకోణాలమయమైందని విమర్శించారు. మంగళవారం టీడీపీ జాతీయ కార్యాలయంలో మీడియాతో ఆమె మాట్లాడుతూ డాలర్ల కుంభకోణం, టోకెన్ల స్కాం, అన్యమత ప్రచారాలు, డిక్లకేషన్ ఇవ్వకుండా ఆలయ ప్రవేశాలు, శ్రీవారి సన్నిధిలో జై జగన్ నినాదాలు, కాళ్లకు చెప్పులతో గుడిలోకి వెళ్లడం వంటివి వైసీపీ పాలనలోనే చూస్తున్నామన్నారు. శ్రీవాణి ట్రస్ట్‌కు వచ్చిన రూ.650 కోట్లు ఏమయ్యాయి? ఎక్కడెక్కడ ఆలయాలు కట్టారో.. శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా? అని ప్రశ్నించారు. రూ.3,096కోట్ల బడ్జెట్‌లో దేనికెన్ని నిధులు కేటాయిస్తున్నారో స్పష్టత లేదని ఆరోపించారు. భక్తులిచ్చే విరాళాలకు లెక్కలు చెప్పడం లేదని మండిపడ్డారు. రూ.150 ఉన్న రూమ్ అద్దెను రూ.1,700కు, రూ.25 ఉన్న లడ్డూ ధరను రూ.100కి పెంచి, వాటర్ బాటిల్ రూ.60 వసూలు చేయడం దారుణమని మండిపడ్డారు.