భీమవరంలో రెండు రోజులపాటు నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు మంగళవారం ముగిశాయి. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ప్రధానంగా జనసేనతో పొత్తు అంటూనే వైసీపీ, టీడీపీలకు దూరంగా ఉంటామంటూ పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. అప్పుడే రాష్ట్రంలో తమ పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. తొలిరోజు పార్టీ రాష్ట్ర ప్రతినిధులు నరసాపురం పార్లమెంట్ పరిధిలోని వంద శక్తి కేంద్రాలను సందర్శించారు. కార్యకర్తలతో మమేకమై పార్టీ పటిష్టతకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. రెండో రోజు మంగళవారం భీమవరం ఆనందా ఫంక్షన్ హాల్‌లో రాష్ట్ర కార్యవర్గ ప్రతినిధులతో సమావేశమయ్యారు. కేంద్ర మంత్రులు మురళీధరన్, భారతీ పవార్, జాతీయ నాయకులు సునీల్ థియోధర్, శివప్రకాశ్, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్సీ విష్ణుకుమార్, నారాయణరెడ్డి, సీఎం రమేష్ పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి కార్యవర్గ ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు.