మన తెలుగు రాష్ట్రాల వారికి కేంద్ర ప్రకటించిన పద్మ అవార్డులు వరించాయి. ఇదిలావుంటే ఆధ్యాత్మిక గురువు చిన్న జీయర్ స్వామిని ప్రతిష్టాత్మక ‘పద్మభూషణ్’ అవార్డు వరించింది. ఆధ్యాత్మిక రంగంలో విశేష సేవలు అందించినందుకు గాను కేంద్ర ప్రభుత్వం ఆయణ్ని పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక చేసింది. చిన్న జీయర్ స్వామితో పాటు తెలంగాణ నుంచి ఆధ్యాత్మిక రంగంలో కమలేష్ డి పాటిల్‌ను పద్మభూషణ్ అవార్డు వరించింది. తెలంగాణకు చెందిన బి రామకృష్ణారెడ్డి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంఎం కీరవాణి, సంకురాత్రి చంద్రశేఖర్‌ను పద్మశ్రీ పురస్కారాలు వరించాయి. సామాజిక సేవా విభాగంలో కాకినాడకు చెందిన సంకురాత్రి చంద్రశేఖర్, గిరిజన, దక్షిణాది భాషలకు సేవలు అందించిన తెలంగాణకు చెందిన రామకృష్ణారెడ్డిని కేంద్రం పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికచేసింది.
తెలుగు వారికి ఈసారి ఎక్కువ మందికి పద్మ పురస్కారాలు దక్కడం విశేషం. మొత్తం 106 మందిని పద్మ పురస్కారాలకు ఎంపిక చేయగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి ఏడుగురు, తెలంగాణ నుంచి ఐదుగురు ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు.
ఓఆర్‌ఎస్ సృష్టికర్త దిలీప్ మహలనబిస్‌ను పద్మవిభూషణ్ పురస్కారం వరించింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన 87 ఏళ్ల ఈ డాక్టర్.. తన ఆవిష్కరణతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 5 కోట్ల మంది ప్రాణాలు కాపాడారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ప్రకటించింది. పలు రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులను ఈ పురస్కారాలకు ఎంపిక చేసింది.
ఆంధ్రప్రదేశ్ పద్మశ్రీకి ఎంపికైనవారు:
★ ఎంఎం కీరవాణి - ఆర్ట్
★ గణేష్ నాగప్ప - సైన్స్ అండ్ ఇంజనీరింగ్
★ సీవీ రాజు - ఆర్ట్స్
★ అబ్బారెడ్డి నాగేశ్వరరావు - సైన్స్ అండ్ ఇంజనీరింగ్
★ కోట సచ్చిదానంద శాస్త్రి - ఆర్ట్స్
★ సంకురాత్రి చంద్రశేఖర్ - సామాజిక సేవ
★ ప్రకాష్‌చంద్ర సూదు - లిటరేచర్
తెలంగాణ నుంచి పద్మశ్రీకి ఎంపికైన వారు:
★ పసుపులేటి హనుమంతరావు - మెడిసిన్
★ మోదుగు విజయ్ గుప్తా - సైన్స్ అండ్ ఇంజనీరింగ్
★ రామకృష్ణారెడ్డి - లిటరేచర్
గత ఏడాది మే 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు పద్మ అవార్డులకు నామినేషన్లను స్వీకరించిన కేంద్రం.. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా పురస్కారాలకు ఎంపికైన వారి జాబితాను బుధవారం (జనవరి 25) రాత్రి విడుదల చేసింది. కళలు, సాహిత్యం, విద్య, వైద్యం, క్రీడలు, సామాజిక సేవ, విజ్ఞానం, ఇంజినీరింగ్, పబ్లిక్ అఫైర్స్, సివిల్ సర్వీస్, వాణిజ్యం, పారిశ్రామిక రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి పద్మ పురస్కారాలు ప్రకటించింది.