జీవో నంబరు 1 వ్యతిరేక పోరాట కమిటీ పిలుపు మేరకు గురువారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద సీపీఎం, సీపీఐ, పలు ప్రజా సంఘాల నాయకులు జీవో 1 రద్దయ్యేవరకు పోరాటం సాగిస్తామని తెలిపారు. బార్ కౌన్సిల్ సభ్యుడు, ప్రముఖ న్యాయవాది, జీవో-1 వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ సుంకర రాజేంద్రప్రసాద్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర నాయకురాలు అక్కినేని వనజ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్.బాబూరావు, సీపీఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు, సీపీఎం సెంట్రల్ కార్యదర్శి రమణారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..... , కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ స్ఫూర్తికి తిలోదకాలిచ్చి నిరంకుశ పాలన సాగిస్తున్నాయని మండిపడ్డారు. ప్రజాస్వామ్య విలువలను మంట కలుపుతున్నారని ఆరోపించారు. ప్రజల నిరసనలను అణ చివేసే ఉద్దేశంతో రాజ్యాంగ విరుద్ధమైన జీవో 1ను ప్రభుత్వం తీసుకువచ్చిందని విమర్శించారు. నిరంకుశ విధానాలకు చట్టబద్ధత కల్పించేందుకే జీవో 1 తెచ్చారని పేర్కొన్నారు. మోడీ గుజరాత్ సీఎంగా ఉండగా సాగించిన మారణకాండను బట్టబయలు చేసే బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించడం అప్రజాస్వామికమని తెలిపారు.