‘‘రాష్ట్రంలో అధికార పార్టీ పరిస్థితి మరింత దిగజారి పోయే ప్రమాదం ఉంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువ గళం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించనున్న వారాహి యాత్ర, మాజీ సీఎం చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా నెలలో నిర్వహించే మూడు పర్యటనల ప్రభావం ప్రజలపై తీవ్రంగా ఉండబోతోంది’’ అని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘నాలుగైదు నెలల క్రితం నేను సర్వే నిర్వహించి, ఫలితాలను వెల్లడించా. తాజాగా ఐప్యాక్ నిర్వహించిన సర్వే నివేదిక ఆ సంస్థ ముగ్గురు డైరెక్టర్లలో ఒకరైన విశాల్ సంతకంతో వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర మంత్రివర్గ సభ్యుల గెలుపోటములపై నేను నాడు నిర్వహించిన సర్వేలో వెల్లడైన ఫలితాలే, ఐప్యాక్ సర్వేలోనూ పునరావృత్తమయ్యాయి. టీడీపీ, జనసేన జత కట్టడం వల్ల గతంలో చెప్పిన దానికి భిన్నంగా హోరా హోరీ స్థానాలు కూటమి ఖాతాలోకే వెళ్తాయి. ప్రస్తుతం మారుతున్న రాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో 30 స్థానాలు గెలుపొందడం కూడా కష్టమే. ప్రత్యేక హోదా సాధన కోసం సీఎం జగన్ శనివారం ఢిల్లీ యాత్ర చేయనున్నట్లు తెలిసింది. కానీ ఢిల్లీ పెద్దలు ఆయనకు సమయం ఇచ్చేందుకు నిరాకరించినట్లు సమాచారం. దక్షిణ ఆంధ్ర నుంచి లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభం కాగా, పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభిస్తే బాగుంటుంది. సీఎం జగన్‌కు అహోబిలం మఠం వ్యవహారంలో జోక్యం తగదు. నేను గతంలో చెప్పినట్లుగానే ఈ ఏడాది జూలై, ఆగస్టు మాసాలలో ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇది నాకున్న పక్కా సమాచారం. కాగా, హీరోయిన్ జమున మృతి పట్ల రఘురామకృష్ణరాజు అశ్రునివాళి అర్పించారు.