పోలీసుల మనోభావాలు, ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేలా మాట్లాడారని చిత్తూరు జిల్లా కుప్పం పోలీస్ స్టేషన్‌లో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై కేసు నమోదు చేశారు. శుక్రవారం కుప్పంలో జరిగిన బహిరంగ సభలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు కుప్పం ఎస్ఐ శివ కుమార్ ఫిర్యాదుతో ఎఫ్. ఐ.ఆర్ నమోదైంది. కుప్పంలో నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పోలీసుల్ని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. పోలీసుల మనోభావాలు, ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేలా మాట్లాడారని ఈ ప్రసంగంపై ఎస్‌ఐ ఫిర్యాదు చేశారు. చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సభలో అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్‌సీపీ పాలనలో ప్రజలు మోసపోతున్నారన్నారు. అక్రమాలు, అన్యాయాలకు గురవుతున్నారని.. మహిళలకు రక్షణ లేకుండా పోతోందనే ఆవేదనతో.. నారా లోకేష్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని పాదయాత్ర చేపట్టారని పేర్కొన్నారు. స్వాతంత్ర్య భారతదేశంలో, ఏపీ ఏర్పడిన తర్వాత ఎన్నో పార్టీలొచ్చాయని.. ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారని.. కానీ నేడు ఈ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని పాలించడం ఏపీ ప్రజల పాలిట శాపంగా మారింది అన్నారు. మూడున్నరేళ్లలో పాలనలో రాష్ట్రంలో ఎవరూ ప్రశాంతంగా లేరని.. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారన్నారు.
ఈ ప్రభుత్వం ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందోనని భయాందోళనలో ప్రజలు వణికిపోతున్నారన్నారు అచ్చెన్నాయుడు. లోకేష్‌కు అవినీతిని అంటకట్టాలని చూశారని.. కానీ సాధ్యపడలేదన్నారు. జగన్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేందుకు యువత కదంతొక్కాలన్నారు. నేడు 5కోట్ల ప్రజలు ఒకవైపు.. జగన్ ఒక వైపు ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ గెలుస్తారో.. 5కోట్ల ఆంధ్రులు గెలుస్తారో ప్రజలే తేల్చుకోవాలన్నారు. రానున్న ఎన్నికల్లో.. టీడీపీ 160 స్థానాల్లో విజయం సాధిస్తుందన్నారు.. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. పోలీసులతో పనిలేకుండా టీడీపీ కార్యకర్తలే సైనికులుగా క్రమశిక్షణతో టీడీపీ అధికారంలోకి రావడానికి పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. యువతే సైన్యమై 400రోజులు క్రమశిక్షణతో పాదయాత్రను ముందుకు తీసుకెళ్లాలని.. రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలన్నారు.