ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద్యోగుల జీతాల్లో 10 శాతం కోతలు... 3 వారాలకు మాత్రమే విదేశీ నిల్వలు

international |  Suryaa Desk  | Published : Sun, Jan 29, 2023, 12:29 AM

పాకిస్తాన్ లో నెలకొన్న దుస్థితికి ఉద్యోగుల జీతాల్లో కోతతోనే తెలిసిపోతోంది. ఓవైపు ఆర్ధిక సంక్షోభం, మరోవైపు రాజకీయ అస్థిరతతో దాయాది పాకిస్థాన్ సతమతమవుతోంది. దీంతో అటు ప్రజలు, ఇటు ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వ ఖజానా మొత్తం ఖాళీ అయిపోగా.. మూడు వారాలకు సరిపడా విదేశీ మారక నిల్వలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకునే దిశగా షెహబాజ్‌ షరీఫ్ సర్కారు చర్యలకు ఉపక్రమించింది. దీంతో ప్రధాని షరీఫ్ ఏర్పాటు చేసిన జాతీయ పొదుపు కమిటీ కొన్ని ప్రతిపాదనలు చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు వేతనాలతో పాటు మంత్రులు ఖర్చుల్లోనూ కోత విధించే ప్రతిపాదనలో ఉన్నట్టు సమాచారం.


ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత విధించాలనే ప్రతిపాదనను ఆ కమిటీ ప్రధానికి ప్రతిపాదించే యోచనలో ఉంది. అలాగే మంత్రిత్వ శాఖలు, సంబంధిత విభాగాల ఖర్చుల్లోనూ 15 శాతం కోత పెట్టాలని యోచిస్తున్నట్లు పాక్ మీడియాలో కథనాలు ప్రసారం అవుతున్నాయి. అంతేగాకుండా మంత్రులను కుదించి, సలహదారులను తగ్గించే దిశగా పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఉన్న 78 మంది మంత్రులను 30కి తగ్గించాలని భావిస్తుండగా.. ఆ మిగిలిన వారు స్వచ్ఛందంగా పనిచేయాలని కోరుతోందట.


ఈ ప్రతిపాదనలను బుధవారం నాటికి ఖరారు చేసిన కమిటీ, వాటిని ప్రధానికి పంపుతుందని జియో న్యూస్ కథనం పేర్కొంది. అటు, ఆర్థిక కష్టాల నుంచి ఉపశమనం పొందేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) సాయం కోసం పాక్‌ ఎదురుచూస్తోంది. కానీ ఆ సంస్థ నిబంధనలను పాటించేందుకు విముఖత ప్రదర్శిస్తోంది. దీంతో రెండున్నర నెలలుగా ఐఎంఎఫ్, పాక్‌ మధ్య ప్రతిష్ఠంభనకు దారితీస్తోంది.


ఐఎంఎఫ్‌ నుంచి 600 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం తీసుకోవడానికి 2019లోనే పాకిస్థాన్‌ అంగీకరించింది. అయితే, ఆ సంస్థ పెట్టిన కఠిన నిబంధనల కారణంగా వెనకడుగు వేస్తోంది. తాము నిధులివ్వాలంటే కరెంటు సబ్సిడీలను ఉపసంహరించాలనీ, అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా గ్యాస్‌ ఛార్జీలు, పాక్‌ రూపాయి మారక విలువను నిర్ణయించాలనీ, లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్లపై నిషేధం తొలగించాలని ఐఎంఎఫ్‌ షరతులు పెట్టింది. గత డిసెంబరులో 24.5 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం ఐఎంఎఫ్‌ షరతుల వల్ల మరింత పెరిగిపోతుందని పాకిస్థాన్‌ ప్రభుత్వం భయపడుతోంది.


ఆర్థిక కష్టాలతో ఇప్పటికే పలు పొదుపు చర్యలు చేపట్టిన పాక్... దేశవ్యాప్తంగా కరెంటు కోతలు విధిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ అధికారుల పనివేళలను కుదించడంతోపాటు మాల్స్‌, పరిశ్రమలను కూడా తొందరగా మూసివేయాలని ఆదేశించింది. రాత్రిపూట వేడుకలపైనా నిషేధం విధించింది. పాలకుల అవినీతి, కరోనా మహమ్మారి వ్యాప్తి, ప్రకృతి వైపరీత్యాలు పాక్‌ను దెబ్బతీశాయి. ఈ ప్రభావం అక్కడి సామాన్యులపై పడింది. దాంతో గోధుమ పిండి కోసం తొక్కిసలాటలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com