ఇటీవల ప్రముఖులు తమ పుస్తకాలలో వివాదాస్పద, కీలక అంశాలు జోడించి సరికత్త చర్చకు పునాది వేస్తున్నారు. ఇదిలావుంటే అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి మైక్ పాంపియో తాజాగా ‘నెవర్ గివ్ యాన్ ఇంచ్: ఫైటింగ్ ఫర్ ది అమెరికా ఐ లవ్’ పేరుతో రాసిన పుస్తకంలో భారత్ విదేశాంగ విధానం, బాలాకోట్ మెరుపు దాడులు సహా పలు ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు. స్వతంత్ర విదేశాంగ విధానం రూపొందించుకున్న భారత్.. చైనా దూకుడు చర్యల కారణంగా తన వ్యూహాత్మక వైఖరిని మార్చుకుని నాలుగు దేశాల క్వాడ్ గ్రూపులో చేరాల్సి వచ్చిందని పేర్కొన్నారు. తూర్పు లడఖ్ సరిహద్దుల్లో భారత్, చైనాల మధ్య దాదాపు మూడేళ్లుగా ప్రతిష్టంభన కొనసాగుతోన్న విషయం తెలిసిందే. జూన్ 2020లో గల్వాన్ లోయ ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత క్షీణించాయి. సరిహద్దు ప్రాంతంలో శాంతి నెలకొనకపోతే ద్వైపాక్షిక సంబంధాలు సాధారణంగా ఉండలేవని భారత్ అభిప్రాయపడుతోంది.
క్వాడ్‌లో భారత్‌ది వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని, ఎందుకంటే ఇది సోషలిస్ట్ భావజాలంపై స్థాపించిన దేశం, ప్రచ్ఛన్న యుద్ధంలో అమెరికా లేదా పూర్వపు సోవియట్ రష్యాలతో పొత్తు పెట్టుకోలేదన్నారు. ‘‘దేశం (భారతదేశం) ఎల్లప్పుడూ నిజమైన కూటమి వ్యవస్థ లేకుండా దాని స్వంత మార్గాన్ని నిర్దేశిస్తుంది... అది ఇప్పటికీ చాలా వరకు ఉంది. కానీ చైనా చర్యలు గత కొన్ని సంవత్సరాలుగా భారత్ తన వ్యూహాత్మక విధానాలను మార్చడానికి కారణమయ్యాయి’’ అని పాంపియో వ్యాఖ్యానించారు.
హిందూ మహాసముద్రంలో చైనా దూకుడుకు కళ్లెం వేయడానికి అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్‌లు 2017లో క్వాడ్ కూటమిగా ఏర్పడ్డాయి. చైనా ఒన్ బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్‌లో భాగంగా భారత ప్రధాన ప్రత్యర్థి పాక్‌తో సన్నిహిత భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంది. ‘‘జూన్ 2020లో చైనా సైనికులు సరిహద్దులో జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులను చంపారు.. ఆ రక్తపాత సంఘటన కారణంగా చైనా విషయంలో వైఖరి మార్చుకోవాలని భారతీయులు డిమాండ్ చేశారు’’ అని పోంపియో పేర్కొన్నారు.
‘‘దీనికి భారత్ ప్రతిస్పందనలో భాగంగా టిక్‌టాక్ సహా డజన్ల కొద్దీ చైనా యాప్‌లను నిషేధించింది.. ఒక చైనీస్ వైరస్ వందల వేలాది మంది భారతీయ పౌరులను చంపుతోంది.. చైనా నుంచి భారత్ ఎందుకు దూరంగా వెళ్లిందని నన్ను కొన్నిసార్లు అడిగారు.. నా సమాధానం భారత నాయకత్వం నుంచి నేరుగా వచ్చింది.. కాలం మారింది.. మనం కొత్తగా ప్రయత్నించడానికి సమయం వచ్చింది.. భారతదేశం గతంలో కంటే అమెరికాతో మరింత సన్నిహితంగా ఉండటానికి ఒక అవకాశాన్ని సృష్టిస్తుందని చెప్పాను’’ అని పాంపియో తన పుస్తకంలో వివరించారు. ఇక, జపాన్ మాజీ ప్రధాని షింజో అబేను దుమ్మున్న నేతగా పాంపియో అభివర్ణించారు. అలాగే, చైనా దుందుడుకు చర్యలను ఆస్ట్రేలియా మాజీ ప్రధాని స్కాట్ మోరిసన్ తీవ్రంగా వ్యతిరేకించారని ప్రశంసించారు.