యవ్వనం ఎంత విలువైందో ఈ బిలీనీయర్ చేసిన ఖర్చు బట్టి తెలుస్తోంది. వయసు పెరిగే కొద్దీ శరీరంలో చాలా మార్పులు సంతరించుకుంటాయి. వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి.. ఇదంతా సృష్టి ధర్మం. అయితే, కొందరు మాత్రం అనేక ఫిట్‌నెస్ సూత్రాలు, ఆరోగ్యకరమైన రోజువారీ వ్యాయామాలను అనుసరిస్తూ వయసు ఛాయలు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. యువకుడిలా కనిపించడానికి కొందరు కాస్మెటిక్ చికిత్సలను అనుసరిస్తారు. కానీ, దీనికి విరుద్ధంగా వయసు మీద పడుతున్నా యువకుడిలా కనిపించాలనుకున్నారు ఓ వ్యాపారవేత్త. బ్రియాన్ జాన్సన్ అనే మిలీనియర్ వయసును తగ్గించుకునే ప్రయత్నంలో ఏం చేస్తున్నారో తెలియజేస్తూ ఓ ప్రత్యేక వీడియో రూపొందించి యూట్యూబ్‌లో పెట్టారు. ఇందుకోసం ఆయన భారీగానే ఖర్చుచేయడం విశేషం.
వృద్ధాప్యఛాయలు కనిపించకుండా నవ యవ్వనుడిగా ఉండాలన్న ఉద్దేశంతో కాలిఫోర్నియాకు చెందిన బ్రియాన్ జాన్సన్ వైవిధ్యంగా ఆలోచించాడు. ఆయన వయసు 45 ఏళ్లు అయినా.. 18 ఏళ్ల యువకుడిలా కనిపించాలని తహతహలాడిపోయారు ఇందుకు ప్రత్యేక వైద్య చికిత్సను పొందుతున్నారు. ఏకంగా ఏడాదికి 2 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నారు.
బ్లూమ్‌బర్గ్ కథనం ప్రకారం.. శరీరంలో కొన్ని మార్పులు చేసినట్లయితే వయస్సు ప్రభావం కనిపించదని బ్రియాన్ జాన్సన్ ఎక్కడో చదివాడు. దీంతో 18 ఏళ్ల వయస్సులో తాను ఎలా ఉన్నారో అదే రూపం తెప్పించుకోవాలన్న కోరికతో వైద్యులను సంప్రదించారు. ఆలివర్ జోల్మాన్ నేతృత్వంలోని వైద్యుల బృందం జాన్సన్‌కు వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా నిత్యం యువనుడిలా కనిపించేలా చికిత్స చేస్తామని హామీ ఇచ్చింది. చికిత్స తర్వాత శరీర దారుఢ్యం, ఊపిరితిత్తుల సామర్థ్యం 18 ఏళ్ల యువకుడిలా, గుండె పని తీరు 37 ఏళ్ల వ్యక్తిలా, చర్మం నిగారింపు 28 ఏళ్ల వ్యక్తిలా కనిపిస్తున్నట్లు జాన్సన్ మీడియాకు వెల్లడించారు.
ఇక, జాన్సన్ శరీరభాగాల పని తీరును గమనించేందుకు నిత్యం 30 మంది వైద్యులు పర్యవేక్షిస్తున్నారట. ఇందుకు కాలిఫోర్నియాలోని జాన్సన్ ఇంట్లో భారీగా ఖర్చుచేసి ప్రత్యేక పరికరాలతో కూడిన ల్యాబ్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు బ్లూమ్‌బర్గ్ తెలిపింది. ఈఏడాది కూడా 2 మిలియన్ డాలర్లు ఖర్చుపెట్టేందుకు సిద్ధంగా ఉన్న జాన్సన్.. తన మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, దంతాలు ఇలా ప్రతీ అవయవం 18 ఏళ్ల యువకుడిలా మారేంత వరకు చికిత్స కొనసాగిస్తానని అంటున్నారు.