సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. తాజాగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని బులెటిన్‌లో ప్రకటించారు. బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా రక్తాన్ని పంపింగ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని, తారకరత్నకు ప్రస్తుతం ఎక్మో ద్వారా కృత్రిమ శ్వాస కొనసాగుతోందని వైద్యులు స్పష్టం చేశారు. తారకరత్నకు ఐసీయూలో ఎక్మోపై చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ఆయన ఆరోగ్యాన్ని 10 మంది వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని తెలిపారు.
తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు, టీడీపీ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని ఉదయం వైద్యులు ప్రకటించడంతో.. అభిమానులు వేచి చూస్తున్నారు. ఇప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో.. అభిమానుల్లో ఆందోళన మరింత ఎక్కువైంది. ఆయన కోలుకోవాలని టీడీపీ శ్రేణులు, నందమూరి అభిమానులు ప్రార్ధనలు చేస్తున్నారు. తారకరత్న త్వరగా కోలుకుని తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నారు.
తారకరత్నతో పాటు బాలయ్య బెంగళూరులోనే ఉన్నారు. తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి కూడా హాస్పిటల్‌లోనే ఉండి ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సాయంత్రానికి బెంగళూరుకు చేరుకోనున్నారు. చంద్రబాబు వెంట నందమూరి, నారా ఫ్యామిలీ కూడా బెంగళూరుకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు బాలయ్యను అడిగి చంద్రబాబు తెలుసుకుంటున్నారు. మెరుగైన వైద్య చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని సూచిస్తున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ కూడా తారకరత్న ఆరోగ్యంపై బాలయ్యను అడిగి ఆరా తీశారు. ఎన్టీఆర్ కూడా తారకరత్న ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
శుక్రవారం మధ్యాహ్నం నారా లోకేష్ పాదయాత్రలో తారకరత్న సొమ్మసిల్లి పడిపోగా.. ఆయనను వెంటనే దగ్గరలోని హాస్పిటల్‌కు తరలించగా.. అక్కడ ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మరో ఆస్పత్రికి తరలించి అక్కడ మెరుగైన చికిత్స అందించారు. తారకరత్నను మరో ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించడంతో.. బెంగళూరులోని నారాయణ హృదయాలకు కుటుంబసభ్యులు తరలించారు. బెంగళూరు నుంచి కుప్పంకు వచ్చిన వైద్యులు.. తారకరత్న ఆరోగ్యంను పర్యవేక్షించారు.
బెంగళూరుకు తరలించాల్సిందిగా సూచించారు. దీంతో తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి అంగీకారంతో ఆయనను ప్రత్యేక అంబులెన్స్‌లో గ్రీన్ ఛానెల్ ద్వారా బెంగళూరుకు తరలించారు. బాలయ్య, అలేఖ్యారెడ్డితో పాటు పలువురు టీడీపీ నేతలు కూడా బెంగళూరుకు చేరుకున్నారు. అటు నిన్న పాదయాత్ర ముగిసిన తర్వాత నారా లోకేష్ కూడా ఆస్పత్రికి వెళ్లి తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.