ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్ధిక మోసాల విచారణకు ప్రత్యేక ఏజెన్సీ,,,సుప్రీం కోర్టు సూచన

national |  Suryaa Desk  | Published : Sun, Jan 29, 2023, 12:32 AM

మనదేంలోని అత్యున్నత్త న్యాయ స్థానం కీలక తీర్పు ఇఛ్చింది. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక ఆవిష్కరణలతో ఆర్థిక మోసాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయని గమనించిన సర్వోన్నత న్యాయస్థానం.. అటువంటి కేసులను పరిష్కరించడానికి ప్రత్యేక ఏజెన్సీని ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. అయితే, అన్ని కేసులలో సీబీఐ విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలమైన కార్పొరేట్‌ సంస్థలు, పారిశ్రామికవేత్తలపై కేంద్రం, రిజర్వ్‌ బ్యాంక్‌ కఠిన చర్యలు తీసుకోవడం లేదని, వీటిపై సీబీఐ విచారణ జరిపించాలని ఓ స్వచ్ఛంద సంస్థ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలుచేసింది.


ఈ పిటిషన్‌పై జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ బీవీ రత్నలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఆర్థిక మోసాలకు సంబంధించిన అన్ని కేసులలో ప్రత్యేకించి బహుళ పెట్టుబడిదారులను మోసం చేసిన సందర్భాలలో సీబీఐ విచారించడం సముచితం కాదని పేర్కొన్నారు.


పిటిషనర్ ఎన్జీవో తరపున హాజరైన న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, ప్రణబ్ సచ్‌దేవ్ వాదనలు వినిపిస్తూ.. రూ.50 కంటే ఎక్కువ డిఫాల్ట్ అయిన కేసులను సీబీఐ విచారణకు అనుమతించాలని ప్రభుత్వం నియమించిన కమిటీ స్వయంగా సిఫారసు చేసిందని వివరించారు. రూ.కోట్ల పెద్ద కేసుల్లో స్థానిక పోలీసులు విచారణను సక్రమంగా నిర్వహించలేకపోవచ్చని, సిఫారసుల మేరకు డిఫాల్టర్ పాస్‌పోర్టును సీజ్ చేయాలని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా ప్రాసిక్యూషన్ చేయాలని కోరారు.


ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు, పాస్‌పోర్ట్‌లను స్వాధీనం చేసుకోవడం వంటి అంశాలు ప్రభుత్వ పరిధిలోకి వచ్చినందున ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని ఆర్బీఐ వాదించడంతో.. దానిని పరిశీలించి, ప్రతిస్పందన తెలియజేయాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ధర్మాసనం కోరింది.


‘‘కొంత ఆందోళనను పరిష్కరించాలి.. మీరు దాని గురించి ఆలోచించాలి.. మీరు ప్రతి కేసులో సీబీఐ విచారిస్తే దాని తర్వాత పరిణామాలు ఉన్నాయి.. ఎవరైనా తప్పు చేస్తే, దాని పర్యవసానాలను ఎదుర్కోవాలి. కానీ అన్ని కేసులూ సీబీఐతో విచారణ చేయించాలా?... ఇది ఇబ్బందికి దారితీస్తుంది.. సీబీఐ భారీ డిఫాల్ట్ కేసులపై దృష్టి పెట్టాలి.. అన్ని కేసులతో దర్యాప్తు సంస్థపై భారం వేస్తే ఏమీ జరగదు, అందరూ ఉలిక్కిపడటం తప్ప.. చాలా కేసులో చూశాం’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.


అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆర్థిక మోసాలు, కుంభకోణాలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా ధర్మాసనం ఎత్తిచూపింది. అలాంటి కేసులను పరిష్కరించడానికి ప్రత్యేక ఏజెన్సీ అవసరమని నొక్కిచెప్పింది. ఇలాంటి కేసులను ఛేదించడానికి చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు సాంకేతికంగా పురోగతి కొనసాగించాలని పేర్కొంది. సాఫ్ట్‌వేర్ దిగ్గజం అయినప్పటికీ భారత్ ఆ విషయంలో వెనుకబడి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.


మంత్రులు, ప్రభుత్వ అధికారుల సూచనల మేరకు ప్రభుత్వరంగ బ్యాంకులు కార్పొరేట్ సంస్థలకు రుణాలు మంజూరు చేస్తున్నందున అన్ని పెద్ద ఆర్థిక మోసాలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదించగా.. సొలిసిటర్ జనరల్ దానిని వ్యతిరేకించారు. ‘‘ఆయన (భూషణ్‌) సీబీఐపై అపారమైన నమ్మకంతో ఉన్నట్లు కనిపిస్తున్నారు’’ అని ధర్మాసనం పేర్కొంది. అయితే, సీబీఐకి సాపేక్షంగా స్వేచ్ఛ ఉందని భూషణ్ బదులిచ్చారు. అనంతరం కేసు విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com