బీజేపీ ప్రభుత్వంపై ఓ స్వామీజీ విమర్శలు గుప్పించి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కు ఓ స్వామీజీ విస్మయానికి గురిచేశారు. సీఎం పక్కనే కూర్చుని ఓ స్వామీజీ.. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ పరిణామం సీఎం బొమ్మైకి తీవ్ర అసహనం తెప్పించింది. ఆ స్వామీజీ చేతుల్లో నుంచి మైకు లాగేసుకున్నారు. విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కర్ణాటకలోని మహదేవపురలో గురువారం (జనవరి 26) జరిగిన ఓ పబ్లిక్ ఈవెంట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలోని గరుడచార్పల్య ప్రాంతంలోని మంజునాథ ఆలయంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కాగినేలె మహాసంస్థాన కనక గురు పీఠాధిపతి ఈశ్వరనందపురి స్వామీజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బెంగళూరులో సరైన మౌలిక సదుపాయాలు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావించారు. ‘బెంగళూరు నగరం టెక్ కారిడార్ మహదేవపురలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ప్రజాప్రతినిధులు, అధికారులు వర్షాలు పడినప్పుడు మాత్రమే ఇక్కడకు వస్తున్నారు. ఇవన్నీ మేం చాలా కాలంగా చూస్తున్నాం. వర్షాలు పడుతున్నప్పుడు ప్రజలు ఇబ్బందులకు గురవకుండా ఏం చేయాలో అధికారులకు తెలియదా? దీనికి శాశ్వత పరిష్కారం కల్పిస్తామని సీఎం కూడా గతంలో హామీలు ఇచ్చారు. కానీ, ప్రజలకు భరోసా కల్పించలేకపోయారు’ అంటూ స్వామీజీ వ్యాఖ్యలు చేశారు.
స్వామీజీ ఈ వ్యాఖ్యలు చేస్తుండగా.. వేదికపై ఉన్న కొంత మంది నేతలు సీఎం బొమ్మైని ఆసక్తిగా గమనించారు. ఇంతలో బసవరాజ్ బొమ్మై.. ఆ స్వామీజీ చేతిలోని మైకును లాక్కొని, రోడ్ల మరమ్మతు కోసం తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని వివరించారు. ‘భరోసా ఇవ్వడమే కాదు, రోడ్ల మరమ్మతుకు ప్రణాళిక సిద్ధం చేశాం. నిధులు విడుదల చేశాం. పనులు కూడా మొదలయ్యాయి. పాత ముఖ్యమంత్రుల మాదిరిగా హామీలు ఇచ్చి మర్చిపోయే రకం కాదు నేను. చెప్పింది చేస్తాను. ఎవరకీ భయపడను’ అని సీఎం బొమ్మై పేర్కొన్నారు.
గత వర్షాకాలంలో బెంగళూరు నగరవాసులు వర్షాలు, వరదలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సోషల్ మీడియాలో దృశ్యాలు వైరల్ అయ్యాయి. ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. వర్షాకాలం పోయి చాలా రోజులు అవుతున్నా, మరమ్మతు పనులు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో స్వామీజీ ఈ అంశాన్ని ప్రస్తావించారు. అయితే, స్వామీజీ చేతుల్లోంచి సీఎం బసవరాజ్ బొమ్మై.. మైకును లాక్కుంటున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కర్ణాటకలో కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.