రెండు ఎయిర్‌ఫోర్స్ యుద్ద విమానాలు కుప్పకూలిపోయాయి. ఈ ఘటనలో ఒకరు దుర్మరణం పాలవ్వగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఘోర విమాన ప్రమాదాలు చోటుచేసుకొంది. ట్రైనింగ్ సమయంలో ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఘటనా స్థలంలో అధికారుల సహాయక చర్యలు చేపడుతున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కూలిపోయిన యుద్ద విమానాలను సుభోయ్-30,మిరాజ్-2000గా అధికారులు గుర్తించారు. మధ్యప్రదేశ్‌లోని మెరానాలో శిక్షణా సమయంలో గాల్లో ఈ రెండు యుద్ద విమానాలు ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు స్పష్టం చేశారు.
గ్వాలియర్ ఆర్మీ ఏయిర్‌బేస్ నుంచి యుద్దవిమానాలు టేకాఫ్ అవ్వగా.. శిక్షణా, విన్యాసాల సమయంలో గాల్లో ఒక్కసారిగా పరస్పరం ఢీకొని కుప్పకూలాయి. శిక్షణా సమయంలో విమానంలో కొంతమంది సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వారి కోసం ఆర్మీ గాలింపు చర్యలు చేపడుతోంది. మోరానాలోని స్ధానికులు విమాన ప్రమాద వీడియోలను చిత్రీకరించారు. ఈ వీడియోలలో నేలపై విమాన శిధిలాలు పడి ఉన్నాయి. ప్రమాద సమయంలో సుభోయ్ 30లో ఇద్దరు పైలట్‌లు ఉన్నట్లు తెలుస్తోండగా.. మిరాజ్ 2000లో ఒక పైలట్ ఉన్నట్లు సమాచారం. ఇద్దరు పైలట్లు సురక్షితంగా ఉన్నారని రక్షణశాఖ అధికారులు చెబుతున్నారు.
యుద్ద విమానాలు కుప్పకూలిన ఘటనపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరా తీశారు. ప్రమాదం జరిగిన విషయాన్ని కేంద్రమంత్రి దృష్టికి ఎయిర్‌ఫోర్స్ చీఫ్ తీసుకెళ్లారు. దీంతో IAF పైలట్‌ల ఆరోగ్య పరిస్థితి గురించి రాజ్‌నాథ్ సింగ్ తెలుసుకున్నారు. ఈ ప్రమాదంపై రాజ్‌నాథ్ సింగ్ ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నట్లు రక్షణశాఖ వర్గాలు స్పష్టం చేశాయి. అటు రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో ఛార్టర్డ్ జెట్ కూలింది. సమాచారం తెలుసుకున్న అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతోన్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.