అచ్యుతాపురం మండలం మళ్లవరానికి చెందిన కర్రి రమణ, సన్యాసమ్మ దంపతు లకు కర్రి ధనలక్ష్మి(16), శ్రీను(13) కుమారుడు ఉన్నారు. ధనలక్ష్మి పదోతర గతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. తల్లిదండ్రులను ఒప్పించి అచ్యుతాపురం లోని నర్సింగ్ కళాశాలలో ఎంపీహెచ్ డబ్లూ కోర్సులో చేరింది. ఈ బాలిక చదువుకు విధి ఫీజుల రూపంలో అడ్డు తగిలింది. రోజువారీ కూలీపనులపై జీవితాన్ని నెట్టుకొస్తున్న పేద దంపతులు కళా శాలకు ఫీజులు చెల్లించలేమని, చదువు మానేయాలని గట్టిగా చెప్పారు. దీంతో ధనలక్ష్మి చదువులేని జీవితం వృథా అనుకొంది. ఈనెల 26న తల్లిదండ్రులు కూలీపనుల కోసం పక్క గ్రామానికి వెళ్లిన తరువాత చీమలామందు తాగింది.
తమ్ముడు శ్రీను చూసి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు లబోదిబోమంటూ ఇంటికొచ్చి కొన ఊపిరితో ఉన్న కుమార్తెను అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించి బతికించు కునేందుకు యత్నించారు. బాలిక పరిస్థితి విషమంగా మారడంతో విశాఖ కేజీహెచ్కి తరలించారు. పరిస్థితి విషమించి శనివారం ధనలక్ష్మి కన్నుమూసింది. చదువుల తల్లి మృతిచెందడంతో కళాశాలలోని తోటి విద్యార్థినులు, మళ్లవరం గ్రామస్థులు విషా దంలో మునిగిపోయారు. 'ఫీజు కట్టలేక చేతులారా చంపేసుకున్నామా! ' అంటూ ఆ తల్లి సన్యాసమ్మ రోదనలు చూపరులను కన్నీరు పెట్టించాయి. అచ్యుతాపురం అదనపు ఎస్సై ప్రసాద్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.