ఏఎస్సై జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి నబకిశోర్ దాస్ మృతిచెందారు. ఛాతీ భాగంలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లడంతో.. ఆయన ప్రాణాలు విడిచినట్టు వైద్యులు వెల్లడించారు. డాక్టర్ దేబాశిస్ నాయక్ నేతృత్వంలోని వైద్యుల బృందం ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించింది. గుండె, ఎడమ ఊపిరితిత్తుల వైపు దూసుకెళ్లిన బుల్లెట్ తీవ్ర గాయం చేయడంతో నబకిశోర్ దాస్ మృతిచెందినట్టు ప్రకటించారు. ఝార్సుగూడ జిల్లా బ్రిజరాజ్ నగర్‌లోని గాంధీ చౌక్ దగ్గర మంత్రిపై కాల్పులు జరిగాయి.
మంత్రి నబకిశోర్.. వాహనం దిగుతున్న సమయంలో ఏఎస్సై గోపాల్ దాస్ కాల్పులు జరిపారు. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిన మంత్రిని.. ఎయిర్ లిఫ్ట్ ద్వారా భువనేశ్వర్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రత్యేక వైద్యుల బృందం చికిత్స చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆస్పత్రికి చేరుకొని ఆయన్ను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
కాల్పులకు జరిపిన ఏఎస్సైని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి మానసిక పరిస్థితి సరిగా లేదని ఏఎస్సై కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ.. మంత్రిపై దాడులు జరగడం తీవ్ర చర్చనీయాంశమయ్యింది. ఒడిశాలో ఎన్నికల సమయంలో ఇటువంటి హింసాత్మక ఘటనలు తరచూ జరుగుతుంటాయని.. ఇవి ఆందోళన కలిగించే విషయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.