భూగర్భ జలాన్ని కాపాడేందుకు వీలుగా పంజాబ్ ప్రభుత్వం ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. కొత్తగా పన్ను విధానాన్ని ప్రవేశపెట్టనుంది. భూమి నుంచి నీరు తోడితే పన్ను వసూలు చేయనుంది. ఫిబ్రవరి 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తోంది. ఇందుకు సంబంధించి పంజాబ్ రాష్ట్ర నీటి నియంత్రణ, అభివృద్ధి యంత్రాంగం నోటిఫికేషన్ జారీ చేసింది.
వ్యవసాయానికి భూగర్భ జలాన్ని వాడితే, అలాగే ఇళ్లల్లో తాగు, ఇతర అవసరాల కోసం వినియోగిస్తే పన్ను ఉండదు. ప్రభుత్వ నీటి పంపిణీ పథకాలు, సైనిక, కేంద్ర పారామిలటరీ బలగాలు, పట్టణ పురపాలికలు, పంచాయతీరాజ్ సంస్థలు, కంటోన్మెంట్ బోర్డులు, అభివృద్ధి మండళ్లు, ప్రార్థనా స్థలాలకు కూడా మినహాయింపు కల్పించారు. నెలలో 300 క్యూబిక్ మీటర్ల నీటికి తోడే వారికి మినహాయింపు కల్పించారు.
మిగిలిన అన్ని వర్గాల వారు భూగర్భ జలాన్ని వాడుకునేట్టు అయితే సంబంధిత యంత్రాంగానికి దరఖాస్తు పెట్టుకోవాలి. పంజాబ్ లో భూగర్భ జలవనరులు అంతరించిపోతున్నాయి. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఏటా భూమిలోకి వచ్చి చేరుతున్న నీరు, వినియోగిస్తున్న తీరు ఆధారంగా, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ పేరుతో మూడు భాగాలుగా ప్రభుత్వం వర్గీకరించింది. గ్రీన్ జోన్ లో క్యూబిక్ మీటర్ నీటి పై రూ.4-14, ఎల్లో జోన్ లో రూ.6-18, ఆరెంజ్ జోన్ లో రూ.8-22 చొప్పున వసూలు చేయనుంది.