వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. ప్రతిపక్ష నేతల ఫోన్లను జగన్ సర్కార్ ట్యాప్ చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు సహా ఇతర నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. ఫోన్లు ట్యాప్ చేసే అధికారం ఎవరిచ్చారు? అని వర్ల రామయ్య ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని శ్రీధర్రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారని చెప్పారు. జగన్ రెడ్డి ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా అవినాష్రెడ్డి ని రక్షించలేడన్నారు. అవినాష్ వ్యవహారంలో చట్టం గెలుస్తుందో.. సీఎం చుట్టరికపు బలం గెలుస్తుందో చూద్దామన్నారు. పెగాసస్ ముసుగులో రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని వర్ల మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఇంటిలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యత వహిస్తూ సజ్జల కూడా రాజీనామాచేయాలని వర్ల డిమాండ్ చేశారు. నైతిక బాధ్యతగా సీఎం తన పదవికి రాజీనామా చేయాలన్నారు.