కడప జిల్లా, రాజంపేట, మండలంలోని మన్నూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ హత్య కేసుకు సంబంధించి ముద్దాయికి న్యాయమూర్తి జీవిత ఖైదు విధించినట్లు రాజంపేట పబ్లిక్ ప్రాసిక్యూటర్ నిజాం జానీ తెలిపారు. సోమవారం ఈ కేసుకు సంబంధించి విచారణ పూర్తైందని నిజానిజాలు నిర్ధారించిన తరువాత హత్యకేసు రుజువైందన్నారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. 2019వ సంవత్సరం జూన్ నెల 7వ తేదీన మన్నూరు పోలీస్‌స్టేషన్ పరిధి నారపురెడ్డిపల్లె గ్రామంలో దేశబోయిన చంద్రశేఖర్ అనే వ్యక్తి తనకు వరుసకు తమ్ముడైన దేశబోయిన సుబ్రహ్మణ్యం, అతని కుటుంబ సభ్యులపై నిత్యం మద్యం సేవించి వచ్చి ఘర్షణకు దిగేవాడన్నారు. అదే క్రమంలో దేశబోయిన సుబ్రహ్మణ్యంను చంద్రశేఖర్ ఈటెతో గుండెపై పొడవడంతో అతను చనిపోయాడన్నారు. ప్రాసిక్యూటర్ సాక్ష్యాలను పరిశీలించి రాజంపేట మూడవ జిల్లా అదనపు జడ్జి ఆర్.వి.వి.ఎస్.మురళీకృష్ణ దేశబోయిన చంద్రశేఖర్‌కు జీవిత ఖైదుతో పాటు రూ.వెయ్యి జరిమానా విధించినట్లు తెలిపారు. ఈ కేసులో ప్రాసిక్యూటర్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా తాను కేసు విచారణ చేశానని, అప్పటి మన్నూరు సీఐ నరసింహులు కేసు నమోదు చేయగా, తదనంతరం సీఐ పుల్లయ్య దీనిపై కేసు పూర్వాపరాలు పర్యవేక్షించినట్లు తెలిపారు.