తాడిపత్రిలో పోలీసు వ్యవస్థపై తమకు నమ్మకంపోయిందని, ప్రజలూ ఇలాగే అనుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. అందుకే తమ పార్టీ కార్యకర్తలపై దాడులు జరిగినా కేసు పెట్టడం లేదని అన్నారు. డీఎస్పీ చైతన్య ఖాకీ దుస్తులను అడ్డం పెట్టుకొని అరాచకాలకు పాల్పడుతున్నా.. డీఐజీ, ఎస్పీ ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు. నగరంలోని తన నివాసంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తరుపున తానొక్కడినే మున్సిపల్ చైర్మనగా ఎన్నికయ్యానంటే.. ప్రజలు తనను ఎంతగా ఆదరించారో తెలుసుకోవాలని సూచించారు. ప్రజలు తనవైపు ఉన్నారని, తానెప్పుడూ ప్రజల్లో ఉన్నానని అన్నారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి గురించి మాట్లాడటం వేస్ట్ అని అన్నారు. చదువురాని, పనికిమాలిన వ్యక్తి ఎమ్మెల్యే అని మండిపడ్డారు. ‘మా పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఎన్నిసార్లు దాడులు చేస్తావ్..? మేం తిరగబడితే పరిస్థితులు వేరుగా ఉంటాయి’ అని హెచ్చరించారు. ప్రజలు పంచె విప్పి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఎమ్మెల్యేని హెచ్చరించారు. ‘మా పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తుంటే నువ్వేమి చేస్తున్నావ్?’ అని డీఎస్పీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.