చిత్తూరు, జిల్లాలో ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్శిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని కలెక్టర్ కె.వెంకట్రమణారెడ్డి వెల్లడించారు.జిల్లా అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై ఆయన మాట్లాడారు.ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్శిటీకోసం ఏర్పేడు మండలంలోని ఐఐటీ పరిసరాల్లో 50 ఎకరాల అనువైన భూమిని గుర్తించి ప్రభుత్వానికి నివేదించామని తెలిపారు. ఆ ప్రాంతంలోనే ఐటీ సెజ్ ఏర్పాటు చేసేందుకు ఏపీఐఐసీ కోరిన మేరకు 200 ఎకరాల భూమిని సర్వే చేసి గుర్తించడం జరిగిందన్నారు.ఏర్పేడు మండలంలో ప్రభుత్వ భూములన్నీ వివిధ రకాల అవసరాలకు కేటాయించడంతో మిగిలిన 500 ఎకరాల భూములను భవిష్యత్తులో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు, ఇతర ఐటీ రంగ సంస్థలు, అవసరాల కోసమే వినియోగించాలని నిర్ణయించామన్నారు.పారిశ్రామిక అవసరాల కోసం తడ, వరదయ్యపాలెం, సత్యవేడు మండలాల్లో వెయ్యి నుంచీ 2 వేల ఎకరాల భూములను గుర్తించి ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు.అలాగే తెలుగు అకాడమీ కార్యాలయం, ప్రింటింగ్ ప్రెస్ కోసం తిరుపతి అర్బన్, రూరల్ మండలాల్లో తగిన స్థలం గుర్తించేందుకు యత్నిస్తున్నామని వివరించారు.