భార్య వివాహేతర సంబంధానికి భర్త బలైన ఘటన పోలీసుల విచారణలో వెలుగుచూసింది. పశ్చిమ గోదావరి జిల్లా, ముసునూరు మండల పరిధిలోని యల్లాపురం గ్రామానికి చెందిన రాయనపాటి రాటాలు (36) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. గత నెల 3వ తేదీ నుంచి రాటాలు కనిపించటం లేదని అతని తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు 5న ముసునూరు పోలీసులు కేసు నమోదు చేశారు. రాటాలు భార్యకు, అదే గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలడంతో సెల్ఫోన్ కాల్ డేటా ఆధారంగా ప్రియుడ్ని అదుపులోకి తీసుకుని విచారించారు. రాటాలు భార్య, ప్రియుడు, మరో ముగ్గురు సహకారంతో రాటాలను చంపి యల్లాపురం తమ్మిలేరు వద్ద పాతిపెట్టినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం మృతదేహాన్ని వెలికితీసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.