2019లో వచ్చిన సవరణ ప్రకారం మోటారు వాహనాల చట్టంలో కొన్ని చాలా తీవ్రమైన మార్పులు చేయబడ్డాయి. ట్రాఫిక్ చట్టాలు మరింత కఠినతరం చేయబడ్డాయి. జరిమానాలు 10 రెట్లు పెంచబడ్డాయి. ఇప్పుడు సైరస్ మిస్త్రీ సంఘటన తర్వాత కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు వెనుక సీట్లో కూర్చొని బెల్టులు ధరించని వ్యక్తులకు కూడా జరిమానా విధించడం ప్రారంభించారు. కొన్ని ట్రాఫిక్ చట్ట ఉల్లంఘన చలాన్‌లను ఇప్పుడు చూద్దాం.
2020, జనవరిలో 'అవసరమైన పత్రాలు లేని కారణంగా' పోర్స్చే యజమానికి రూ.27.68 లక్షల జరిమానా విధించారు. పోర్స్చే కంటే ముందు రాజస్థాన్ లో రిజిస్టర్ చేయబడిన వాహనానికి ఢిల్లీలో రోహిణి సర్కిల్ పోలీసులు 'ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు రూ.1,41,700 జరిమానా విధించారు.
చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కారులో లేదా బైక్ పై బయటకు వెళ్తే రూ.5 వేల చలాన్ విధిస్తారు. ఇది గతంలో రూ. 500 ఉండేది. చెల్లుబాటు అయ్యే నెంబర్ ప్లేట్ లేకుండా అనధికారిక వాహనం నడుపుతున్నప్పుడు రూ.5,000 చలాన్ విధిస్తారు.
RC గడువు ముగిసిన లేదా ఫిట్‌నెస్ పరీక్షల్లో విఫలమైన వాహనాన్ని నడిపితే చలాన్ రూ.10,000 కట్టాలి. ఇది గతంలో రూ.500 ఉండేది. ర్యాష్ లేదా ప్రమాదకరమైన డ్రైవింగ్ కు మొదటిసారి 1,000 నుండి రూ. 5,000 జరిమానా, 6 నెలల నుండి 1 సంవత్సరం వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. రెండవసారి అయితే 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా రూ. 10,000 వరకు జరిమానా విధిస్తారు.
మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే మొదటి సారి రూ.10,000 జరిమానా, రెండోసారి అయితే రూ.15,000 జరిమానా, అదనంగా ఆరు నెలల నుంచి రెండేళ్ల జైలు శిక్ష విధించబడుతుంది.
వాహనంలో ప్రయాణీకులను ఓవర్‌లోడ్ చేస్తే ఒక్కో అదనపు ప్రయాణీకునికి రూ.1,000 జరిమానా విధిస్తారు, అయితే దాని పేలోడ్ పరిమితికి మించి వాహనాన్ని ఓవర్‌లోడ్ చేస్తే రూ. 20,000 (అదనపు టన్నుకు రూ.2,000) చలాన్ విధించబడుతుంది.
అత్యవసర వాహనానికి దారి ఇవ్వకపోతే రూ.10,000 జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష విధించవచ్చు. బాలనేరస్థులు చేసిన నేరాలకు రూ. 25,000 జరిమానా, 3 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. (వాహన యజమాని లేదా సంరక్షకుడు దోషిగా పరిగణించబడతారు).
2019 సెప్టెంబర్‌లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా మోటారు వాహనాల చట్టం 2019 ప్రకారం పేలవమైన రోడ్లను నిర్మించి, వాటి సరైన నిర్వహణను నిర్లక్ష్యం చేసినందుకు కాంట్రాక్టర్లకు రూ.1 లక్ష వరకు జరిమానా విధించబడుతుందని చెప్పారు.