కె.విశ్వనాథ్ లేరని ఊహించుకోవడమే కష్టంగా ఉందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా అన్నారు. ప్రఖ్యాత సినీ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ కుటుంబ సభ్యులను ఆర్కే రోజా సెల్వమణి పరామర్శించారు. కె.విశ్వనాథ్ భార్య, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన మంత్రి రోజా.. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీకి కె.విశ్వనాథ్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం మంత్రి రోజా మాట్లాడుతూ.. తెలుగు సినిమాల ద్వారా సాహిత్యానికి, సంస్కృతికి కె.విశ్వనాథ్ చేసిన సేవ ఇంకెవ్వరూ చేయలేరేమో అనిపిస్తుందన్నారు.
కె.విశ్వనాథ్ లేరని ఊహించుకోవడమే కష్టంగా ఉందని మంత్రి రోజా అన్నారు. సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివన్నారు. తన సినిమాల్లో తెలుగుదనం, తెలుగు సాహిత్యం, సంస్కృతి ఉట్టిపడేలా చేశారని పేర్కొన్నారు. కె.విశ్వనాథ్ సినిమాలు ఒక మెసేజ్‌ని అందించి, వాటిని ముందుకు తీసుకువెళ్లేలా ఉంటాయని వివరించారు. ఒక దర్శకుడిగా, నటుడిగా ఆయన ఆదర్శంగా జీవించారన్నారు. కె.విశ్వనాథ్‌ను చూస్తే ఒక టీచర్‌ను చూసినట్లు భయం వేస్తుందన్నారు. నిజంగానే ఆయన పరిపూర్ణ జీవితం అనుభవించారని చెప్పారు.
కె.విశ్వనాథ్ ఆత్మకు శాంతి కలగాలని అందరూ కోరుకోవాలని మంత్రి రోజా పిలుపునిచ్చారు. తెలుగు నెల ఉన్నంత వరకు.. తెలుగు వారంతా అభిమానించే విశ్వనాథ్ చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. తెలుగు సినిమాకు ఆయన చేసిన సేవలను గుర్తించి.. ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చి సత్కరించిందన్నారు.