రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై టీడీపీ రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తోందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి దుయ్యబట్టారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు నిరాధార ఆరోపణలు, అసత్య ప్రకటనలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఏపీ ఆర్థిక అంశాలపై యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు శనివారం మంత్రి బుగ్గన ఓ ప్రకటన విడుదల చేశారు.
స్థిర ధరల వృద్ధి రేటులో 2021- 22 ఏడాదికి సంబంధించి ఏపీ 11.22 శాతం వృద్ధి నమోదు చేసిందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. ఏ విధంగా లెక్క వేసినా మైనస్ 4 శాతం వృద్ధి అనేది అసాధ్యమన్నారు. కోవిడ్ సమయంలో దేశ వృద్ధిరేటు -6.60 శాతంగా నమోదైతే ఏపీ 0.08 శాతం మేర వృద్ధి నమోదు చేసిందన్నారు.
అనుభవజ్ఞుడైన యనమల జీఎస్డీపీని గణించటంలో తప్పుచేశారని మంత్రి బుగ్గన ఆక్షేపించారు. నవరత్నాల ద్వారా రాష్ట్ర ప్రజలకు ఇప్పటి వరకు రూ. 1.92 లక్షల కోట్లు అందించినట్లు వెల్లడించారు. ప్రతి గ్రామంలో ఏర్పాటైన సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లీనిక్‌లు, డిజిటల్ లైబ్రరీలు, మిల్క్ చిల్లింగ్ కేంద్రాలను అభివృద్ధిగా పరిగణించరా అని ప్రశ్నించారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని.. రూ.100 కోట్లు మాత్రమే మిగిలిందంటూ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి శ్రీలంక, జింబాబ్వేలా తయారైందని టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేయటం బాధ్యతా రాహిత్యమని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. 40 ఏళ్లు పైబడిన యువ నాయకుడు ముఖ్యమంత్రిగా ఎలా అభివృద్ధి చేస్తున్నారో అర్థంకాక టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు. 2019లో టీడీపీ దిగిపోయే నాటికి రూ.2,64,451 కోట్ల అప్పు ఉంటే.. 2022 నాటికి రూ.3,98,903 కోట్లు అయినట్టు పార్లమెంటులో కేంద్రం ప్రకటించిందని తెలిపారు. అంటే, గత మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.1,34,452 కోట్లు మాత్రమేనని బుగ్గన వివరించారు.