నేడు శ్రీవారికి పౌర్ణమి గరుడ వాహన సేవ సందర్బంగా తిరుమలను పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో కేంద్రమంత్రి ఎల్ మురుగన్, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు వారి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం, తితిదే అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనుపమ చక్రవర్తి కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమల శ్రీవారికి ఇవాళ పౌర్ణమి గరుడ సేవ నిర్వహించనున్నారు. అందుకు టీటీడి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ రాత్రి ఏడు గంటల నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మాలయప్ప స్వామి వారు గరుడ వాహనంపై దేవాలయ నాలుగు మడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
తిరుమలలో ఇవాళ నూతన పరకామణి మండపంలో హుండీ లెక్కింపు కార్యక్రమం ప్రారంభం కానుంది. రూ. 23 కోట్ల వ్యయంతో నూతన పరకామణి మండపాన్ని టీటీడీ ఇటీవల నిర్మించింది. దీంతో ఇవాళ్టి నుంచి తిరుమలలోనే హుండీ ఆదాయం లెక్కించనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.