ఓ బాలుడి ఆట తండ్రి జేబుకు చిల్లువేసింది. అదేలాగు అంటారా...? సెల్ ఫోన్లు ఇప్పుడు మనిషి జీవితంలో ప్రధాన భాగమయ్యాయి. పచ్చిగా చెప్పాలంటే లైఫ్ పాట్నర్ల కంటే ఎక్కువైపోయాయి. అంతటితో ఆగితే పర్వాలేదు. ఇప్పుడు పిల్లలు కూడా సెల్ ఫోన్లకు బానిసలయ్యారు. ఫోన్ లాక్కొని పక్కనపెడితే.. నానాయాగీ చేస్తున్నారు. అలాగని, ఒత్తిళ్లతో కూడిన ఈ ఉద్యోగ జీవితంలో పిల్లలతో ఎక్కువ సమయం గడపలేము. వాళ్ల చేతిలో ఫోన్ పెడితే గానీ.. మన పనులను చక్కబెట్టుకోలేము. ఇక ఆ ఫోన్లతో ఆడుకుంటూ చిన్నారులు చేసే చిలిపి పనులు తల్లిదండ్రులకు తల ప్రాణాన్ని తోకకు తీసుకొస్తున్నాయి. ఇలాగే ఆరేళ్ల బుడతడొకడు సెల్ ఫోన్‌తో ఆడుకుంటూ ఆన్‌లైన్ ఫుడ్ యాప్ ద్వారా ఏకంగా 80 వేల రూపాయల ఫుడ్ ఆర్డర్ చేశాడు. డెలివరీ బాయ్‌లు కార్లలో భారీ సంఖ్యలో ఫుడ్ బాక్సులు తీసుకొచ్చి ఇంటి ముందు ఆపితే, ‘మన కాలనీలో పెళ్లి ఎవరిదబ్బా..?’ అనుకుంటూ బాలుడి తండ్రి ఆలోచనలో పడ్డాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగింది? అమెరికాలోని మిచిగాన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన గురించి బాలుడి తండ్రి సోషల్ మీడియా ద్వారా వివరించాడు.
మిచిగాన్‌కు చెందిన కీత్ స్టోన్‌హౌస్ భార్య ఇటీవల ఒక రోజు సాయంత్రం తన ఫ్రెండ్స్‌తో కలిసి సినిమాకు వెళ్లింది. ఆరేళ్ల కుమారుడు మాసన్‌ను తాను తిరిగొచ్చేవరకు చూసుకోమని భర్తకు చెప్పింది. తల్లి బయటకు వెళ్లగానే.. ఆ బాలుడు తన తండ్రి ఫోన్ తీసుకొని ఆడుకోవడం మొదలెట్టాడు. కాసేపటి తర్వాత కునికిపాట్లు తీస్తుండటంతో తండ్రి అతడిని బెడ్రూంలోకి తీసుకెళ్లి జో కొడుతున్నాడు.
ఇంతలో ఒక కారు వచ్చి కీత్ ఇంటి ముందు ఆగింది. డిక్కీ పైకి లాగి ఒక పెద్ద బ్యాగ్‌ను కిందకు దించుతుండటం అతడు చూశాడు. ఆ వ్యక్తులు వేసుకున్న టీ షర్టులను చూస్తే, వాళ్లు డెలివరీ ఏజెంట్స్ అని, ఆ బ్యాగులో ఉన్నది ఫుడ్ ఐటెమ్స్ అని అతడికి ఇట్లే అర్థమైంది. మన కాలనీలో ఎవరింట్లోనైనా పెళ్లో, శుభకార్యమో ఉందా అని అతడు ఆలోచిస్తుండగా.. ‘టింగ్’మంటూ కాలింగ్ బెల్ మోగింది.
డోర్ తీయగానే.. ఎదురుగా చికెన్ షాండ్‌విచ్‌లు, షావర్మా, రొయ్యల వంటకాలు, ఐస్ క్రీమ్‌లు, చిల్లీ చీజ్ ఫ్రైస్‌లు.. ఇలా పెద్ద మొత్తం ఆహారం బాక్సులు ఉన్నాయి. కీత్ వాటిని ఆశ్చర్యంగా చూస్తుండగానే.. ఈ ఆర్డర్స్ అన్నీ ‘మీవే సార్’ అన్నాడు డెలివరీ బాయ్. ‘కొంపదీసి నా భార్య తన ఫ్రెండ్స్ కోసం ఇవన్నీ ఆర్డర్ చేసిందా..?’ మళ్లీ ఆలోచనలో పడ్డాడు కీత్.
ఆ ఫుడ్ అంతా లోపల పెట్టించి, ఫోన్ అందుకున్నాడు. తన భార్యకు డయల్ చేయబోతుండగా.. మళ్లీ కాలింగ్ బెల్ మోగింది. ఈసారి మరో కారు ఆగి ఉంది. ఆహార పొట్లాలు కిందకి దించుతున్నారు. ‘ఏంటివి..?’ - అమాయకంగా అడిగాడు కీత్. ఫుడ్ ఐటెమ్స్ పేర్లన్నీ చెప్పి.. ఇవన్నీ మీ ఆర్డర్సే సార్ అని చెప్పాడు డెలివరీ బాయ్. అతడితో మాట్లాడుతుండగానే.. తన చేతిలో ఉన్న ఫోన్ టంగ్, టంగ్‌మని మోగుతోంది. ‘మీ ఆహారం సిద్ధంగా ఉంది’, ‘మీ ఆహారం డెలివరీ అవుతోంది’ అంటూ పదేపదే మెసేజ్‌లు వస్తున్నాయి. అమ్మ బాబోయ్.. ఏం జరుగుతోంది? అనుకుంటూ ఫోన్ తెరిచి చూస్తే, అప్పటికే బ్యాంక్ ఖాతా ఖాళీ అయిపోయింది.
గేమ్స్ ఆడుతున్నాడని భావించిన కీత్ కుమారుడు.. గ్రుభుబ్ (యూఎస్‌లో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ఫ్లాట్‌ఫాం) ఉపయోగించి భారీ మొత్తంలో ఆహారాన్ని ఆర్డర్ చేశాడు. ఏకంగా 1,000 డాలర్ల (భారతీయ కరెన్సీలో రూ. 80,000) విలువైన ఫుడ్ ఆర్డర్ చేశాడు.
కీత్‌కు విషయం అర్థమవగానే.. కుమారుడి వద్దకెళ్లి, నిద్ర లేపి.. ‘ఫోన్ తీసుకొని ఏం చేశావ్ రా?’ అంటూ ఒకింత అసహనంతో అరిచాడు. నిద్ర మత్తు వదలని ఆ బాలుడు.. ‘నాన్నా.. పెప్పరోని పిజ్జాలు వచ్చాయా?’ అంటూ తిరిగి ప్రశ్నించాడు. ఆ మాటలు వినగానే కీత్.. అంత కోపంలోనూ కడుపు పగిలేలా నవ్వాడు.
‘ఈ ఘటన జరిగినప్పుడు నా కోపం లెవల్ 10కి 9.5గా ఉంది. మరుసటి రోజు 8కి తగ్గింది. ప్రస్తుతం 3కి తగ్గింది. అయినా, ఇప్పుడు నాకిది ఫన్నీగా అనిపించడంలేదు. ఎందుకంటే, నేను కోల్పోయిన డబ్బులు ఏమన్నా చిన్న మొత్తమా? మీతో కలిసి నేను ఎలా నవ్వగలను? ఎంత కష్టపడితే ఇంత డబ్బు వస్తుందో పిల్లలకు ఎలా చెప్పేది..?’ అని కీత్ రాసుకొచ్చాడు.
కీత్ మరుసటి రోజు తన కుమారుడు మాసన్‌తో మాట్లాడి, అతడు ఎంత పెద్ద తప్పు చేశాడో, నచ్చజెప్పేందుకు ప్రయత్నించాడట. ఆ చిన్నారి విసిగిపోయి, ‘అవన్నీ నాకు తెలియదు నాన్నా’ అన్నాట్ట, చిరాగ్గా. మళ్లీ నవ్వాలో? ఏడ్వాలో..?! ఈ మొత్తం ఎపిసోడ్‌లో కీత్‌కు ఊరటనిచ్చిన అంశం ఏమిటంటే.. అతడు పెట్టిన పోస్టు వైరల్ అయ్యి ‘గ్రుభబ్’ దృష్టికి వెళ్లడంతో.. ఆ సంస్థ అతడికి 1,000 డాలర్ల వోచర్‌ను కానుకగా ఇచ్చింది. తన కొడుకు చేసిన ఘనకార్యాన్ని గుర్తు చేసుకొని, కీత్ ఇప్పుడు కాస్త రిలీఫ్‌గా నవ్వుకోగలుగుతున్నాడు.
‘ఇది అద్భుతమైన ముగింపుతో కూడిన హాస్యాస్పదమైన కథ. నేను నవ్వు ఆపుకోలేకపోతున్నా’ అంటూ ఓ యూజర్ కామెంట్ పెట్టారు. ‘పిల్లలు మన జీవితాలను చాలా సరదాగా, ఆసక్తికరంగా మారుస్తారు!!’ అంటూ మరో యూజర్ కామెంట్ చేశారు. నిజమే కదూ..?!