వైసీపీ విజయానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలను కాదని, ఇతర పార్టీలనుంచి వలస వచ్చిన వారికి గుర్తింపు ఇవ్వడం పట్ల కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు వైఖరికి నిరసనగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఎమ్మెల్యే అనుచరుడు, సర్పవరం శ్రీభావనారాయణస్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్లు పుల్ల శ్రీరాములు(శ్రీను), శేషుకుమారి ప్రకటించారు. సర్పవరంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి చేసిన సేవలకు గుర్తింపుగా తన భార్య శేషుకుమారికి భావనారాయణస్వామి ఆలయానికి చైర్మన్‌గా నియమించామన్నారు. ఆలయ అభివృద్ధిపై ఈవో కనీస సమాచారం ఇవ్వకపోవడం, ప్రొటోకాల్ పాటించకపోవడంపట్ల పలుమార్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా ఏమాత్రం పట్టించుకోకుండా, పలు ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. పార్టీలో అంకితభావంతో పనిచేసిన వారికి గుర్తింపు లేదని, పార్టీలోకి వలస వచ్చిన వారికి పెద్దపీట వేస్తూ పదవులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. పార్టీలో ఉంటూ అవమానాలకు గురవ్వడం ఇష్టం లేక, ఎమ్మెల్యే కన్నబాబుపై అసంతృప్తితో తాము పార్టీని వీడుతున్నామన్నారు. భవిష్యత్తులో ఏపార్టీలో చేరేది త్వరలో తెలియజేస్తామన్నారు.