అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానన్న హామీని అమలు చేయమని అడిగితే నిర్బంధించడం, కేసులు పెట్టడమేంటని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం విజయవాడలోని యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో సంకల్ప దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. 33 శాతం ఏవిధంగా పాత పెన్షన్‌కు సమానమో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పక్క రాష్ర్టాలు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తుంటే.. ఎన్నికల ముందు హామీ ఇచ్చి కూడా రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదో ఉద్యోగ వర్గాలకు సమాధానం చెప్పాలన్నారు. మూడు నెలలుగా జీతాలు రావడం లేదని ఆరోపించిన కానిస్టేబుల్‌పై కేసు పెట్టి జైలుకు పంపారన్నారు. ప్రభుత్వ విధానాలపై గళం విప్పితే, వారిపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర నాయకుడు మనోహర కుమార్ మాట్లాడుతూ.. సీపీఎస్ వల్ల పదవీ విరమణ తర్వాత ఉద్యోగుల జీవితాలు అగమ్యగోచరంగా మారుతాయన్నారు. ఈ దీక్షకు యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా, యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.సుందరయ్య తదితరులు పాల్గొన్నారు.