‘‘మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణలో సీఎం జగన్ సహకరించి ఉంటే పది రోజుల్లోనే ఈ కేసు తేలిపోయేది. ఆయన సహకరించకపోవడం వల్లే కేసును హైదరాబాద్‌కు బదిలీ చేశారు. నిజాలేంటో త్వరలోనే వెల్లడవుతాయి’’ అని ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి అన్నారు. ఈ నెల 10న విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ కోర్టు ఆదేశించిన నేపథ్యంలో దస్తగిరి ఆదివారం కడప సెంట్రల్ జైలు వద్ద ఉన్న సీబీఐ అతిథిగృహానికి వచ్చి నోటీసులు తీసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విచారణ సందర్భంగా తాను అబద్ధాలు చెప్పి ఉంటే కేసు ఇంతవరకు రాదన్నారు. సీబీఐ పక్కా సమాచారంతోనే అడుగులు వేస్తోందని, అందుకే ఎంపీ అవినాశ్‌రెడ్డిని విచారించారని చెప్పారు. ఏపీలో కేసు విచారణకు ప్రభుత్వం సహకరించకపోవడంతోనే హైదరాబాద్‌కు బదిలీ చేశారని తెలిపారు. అక్కడికి బదిలీ చేయడం మంచిదేనని, న్యాయం జరుగుతుందన్నారు. ఇటీవలే సీబీఐ అధికారులు కొందరిని విచారించడాన్ని బట్టి వారి దగ్గర పూర్తి సమాచారం ఉందని తెలుస్తోందన్నారు.