మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు. కోట్లాది రూపాయిలు విలువ చేసే ప్రభుత్వ భూమిని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి కేటాయించారంటూ కొల్లు రవీంద్ర, కొనకళ్ల బల్లయ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అయితే, ఈ నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా వైసీపీ కార్యాలయ స్థలాన్ని మీడియాకు చూపేందుకు కొల్లు రవీంద్ర ప్రయత్నించారు. అయితే దీనికి పోలీసులు ఒప్పుకోలేదు. అలాగే, కొల్లు రవీంద్రను అడ్డుకున్న పోలీసులు.. బల్లయ్యను అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల చర్యలను కొల్లు రవీంద్ర, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రతిఘటించారు. ఈ క్రమంలో పరిస్థితి అదుపు తప్పడంతో కొల్లు రవీంద్రను కూడా పోలీసులు అరెస్టు చేసి, గూడూరు వైపు తరలించారు. దీంతో మచిలీపట్నం లక్ష్మీటాకీస్ సెంటర్ స్తంభించిపోయింది.
మరోవైపు గుడివాడ నాగవరప్పాడు అక్రమణల తొలగింపులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రోక్లయినర్‌కు అడ్డంగా కూర్చొని, ఇళ్ల కూల్చివేతలను మహిళలు అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు బాధితులకు అండగా నిలిచారు. అధికారులతో, టీడీపీ శ్రేణుల వాగ్వాదంతో అధికారులు వెనుదిరిగారు. స్థానికంగా ఉన్న వైసీపీ నేత భూముల ధరల పెరుగుదలకే పేదల ఇళ్లను కుల్చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే రావి మండిపడ్డారు. సాక్షాత్తూ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రభుత్వ భూములను అక్రమించుకుంటే చర్యలు శూన్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన గంటలోనే, వైసీపీ నేతల ఆక్రమణల, కూల్చివేతలు మొదలెడతామని మాజీ ఎమ్మెల్యే రావి వెల్లడించారు.