ఏపీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలలో కాకపుట్టిస్తోంది. తమ ఫోన్లపై ప్రభుత్వం నిఘా ఉంచిందని, ట్యాప్ చేస్తోందంటూ ఇప్పటికే పలువురు నేతలు ఆరోపణలు చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసి కాక రేపారు. గత కొన్ని నెలలుగా ప్రభుత్వం తన ఫోన్‌ను ట్యాప్ చేస్తోందని, దీంతో 12 సిమ్‌కార్డులు మార్చాల్సి వచ్చిందని చెప్పారు.
తాజాగా, ఈ జాబితాలోకి శాసనసభ మాజీ ప్రొటెం స్పీకర్, పీడీఎఫ్ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం చేరారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే తన ఫోన్ కూడా ట్యాపింగ్‌లో ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఒంగోలులో నిన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్యేల ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేస్తోందన్న కోటంరెడ్డి ఆరోపణలపై స్పందిస్తూ ఆయనిలా వ్యాఖ్యానించారు. తన ఫోన్ కూడా నిఘాలోనే ఉందన్న అనుమానాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలను గమనిస్తుంటే ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తోందని ఎమ్మెల్సీ విఠపు అనుమానం వ్యక్తం చేశారు.