ఆసియా కప్ ను పాకిస్థాన్ లో నిర్వహించాలన్నది తమ ఆకాంక్ష అని, ఒకవేళ ఈ టోర్నమెంట్ వేరే వేదికకు (ఇతర దేశాలకు) మారితే మాత్రం.. భారత్ లో ఈ ఏడాది జరిగే ప్రపంచకప్ కు పాకిస్థాన్ జట్టును పంపించబోమని బీసీసీఐ కార్యదర్శి జైషాకు స్పష్టం చేసినట్టు తెలిసింది. పూర్వపు పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా కూడా అప్పట్లో ఇదే విధమైన ప్రకటన చేయడం గుర్తుండే ఉంటుంది. రెండు దేశాలు ఆసియా కప్ అంశాన్ని పరిష్కరించుకోకపోతే, భారత్ లో జరిగే ప్రపంచకప్ ను బహిష్కరిస్తామని అప్పట్లో రాజా అన్నారు.
ఇప్పుడు నజమ్ సేతి కూడా ఇలానే మాట్లాడారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో ఆసియాకప్ జరగాల్సి ఉంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న జైషా.. గతేడాది ఓ సందర్భంలో మాట్లాడుతూ ఆసియా కప్ కోసం భారత్ జట్టు పాకిస్థాన్ కు వెళ్లబోదని ప్రకటన చేశారు. దౌత్యపరమైన అంశాలను కారణంగా పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చిలో ఆసియాకప్ వేదిక మార్పుపై తుది నిర్ణయం జరగనుంది. గత శనివారం బహ్రెయిన్ లో జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సమావేశంలో పాకిస్థాన్ వైఖరిని నజమ్ సేతి తేల్చి చెప్పినట్టు తెలిసింది. ఈ ఏడాది ఆసియా కప్, 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించే హక్కులను తాము వదులుకునేది లేదని జైషాకి స్పష్టం చేసినట్టు సమాచారం.