భారతీ సిమెంట్స్ ఆస్తుల అటాచ్‌మెంట్ వ్యవహారంపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. బ్యాంకు గ్యారెంటీలు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల విడుదల విషయంలో భారతీ సిమెంట్స్‌కు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలంటూ సుప్రీం కోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ రామసుబ్రహ్మణ్యం, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని ధర్మాసనం అఫిడవిట్ దాఖలు చేయాలని భారతీ సిమెంట్స్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాతే తదుపరి విచారణ చేపడతామని తేల్చి చెప్పింది.
భారతీ సిమెంట్స్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. బ్యాంకు గ్యారెంటీ తీసుకొని ఆస్తులు, ఎఫ్‌డీలను విడుదల చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. బ్యాంకు హామీ తీసుకున్న తర్వాత కూడా రూ. 150 కోట్ల విలువైన ఎఫ్‌డీలను ఈడీ జప్తు చేసుకుందని కోర్టుకు వివరించారు.
అయితే, ఎఫ్‌డీలను జప్తు చేసుకోలేదని ఈడీ తరఫున వాదించిన అదనపు సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్ కోర్టుకు తెలిపారు. ఎఫ్‌డీలను జప్తు చేశారో? లేదో? అన్న వివరాలతో వారం రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని భారతీ సిమెంట్స్‌ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆ అఫిడవిట్‌ను తాము కూడా పరిశీలించి తగిన సమాధానం ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలని ఈడీ తరఫు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. దీనికి సుప్రీం కోర్టు ఆమోదం తెలిపింది. ప్రతివాదిగా ఉన్న భారతీ సిమెంట్స్ అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాతే తదుపరి విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది.