టర్కీ భూకంప ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ట్విట్టర్‌లో స్పందించిన ప్రధాని.. ‘‘భూకంపం కారణంగా భారీగా ప్రాణ, ఆస్తినష్టం జరగడం బాధాకరం.. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాను... క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి.. టర్కీ ప్రజలకు భారత్ సంఘీభావంగా నిలుస్తుంది.. ఈ విషాదాన్ని ఎదుర్కోవటానికి అన్ని విధాలుగా ఇరు దేశాలకు సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది’’ అని మోదీ ట్వీట్ చేశారు.
ఇదిలావుంటే టర్కీ కాలమానం ప్రకారం.. తెల్లవారుజామున 4.17 గంటలకు రిక్టర్ స్కేల్‌పై 7.8 తీవ్రతతో తొలి భూకంపం చోటుచేసుకుంది. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం.. ఆగ్నేయ తుర్కియేలోని గాజియాన్‌తెప్ ప్రావిన్సుల్లోని నుర్దగి నగరానికి 33 కిలోమీటర్ల దూరంలో 18 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. దీంతో దక్షిణ టర్కీ, ఉత్తర సిరియాలోని పలు ప్రాంతాల్లో భూకంపం తీవ్ర ప్రభావం చూపించింది. టర్కీలోని దియర్‌బకీర్, సిరియాలోని అలెప్పో, హమా నగరాల్లో వందలాది భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి.
7.8 తీవ్రతతో తొలి భూకంపం సంభవించిన కొద్ది నిమిషాల్లో 6.7 తీవ్రతతో మరో భూకంపం నమోదయ్యింది. మొత్తం 20 సార్లు శక్తిమంతమైన భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రమాద తీవ్రతగా ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. సిరియా అధీనంలో ఉన్న ప్రాంతాల్లో కనీసం 250 మంది చనిపోయినట్టు అధికారులు తెలిపారు. మరో 639 మంది గాయపడినట్లు తెలిపింది. కాగా.. రెబల్స్ అధీనంలో ఉన్న ప్రాంతాల్లో కనీసం 47 మంది మరణించినట్లు తెలుస్తోంది. భవనాల శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
అటు, టర్కీలో ఇప్పటి వరకూ 290 మంది చనిపోయినట్టు ఆ దేశ ఉపాధ్యక్షుడు పౌత్ ఒక్టే తెలిపారు. అలాగే, మరో 2,300 మంది గాయపడ్డారని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. శిథిలాల కింద వందలాది మంది ఇంకా చిక్కుకున్నారని పేర్కొన్నారు. విపరీతమైన చలి, మంచు వల్ల సహాయక చర్యలు ఆటంకం ఏర్పడింది. రహదారులపై మంచు పేరుకుపోయింది.